![టైగర్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05kgm252-192026_mr-1738780849-0.jpg.webp?itok=YUfSw4KF)
టైగర్..‘భద్ర’!
పాల్వంచరూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా పులి అప్పుడప్పుడు జిల్లాలోకి ప్రవేశిస్తున్నా.. కొన్ని రోజుల సంచారం తర్వాత వెళ్లిపోయేది. అయితే గత డిసెంబర్ 10న ఏటూరునాగారం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, ములుగు అటవీ ప్రాంతం మీదుగా వెంకటాపురం(కె)మండలం బోదాపురంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి మల్లూరు గుట్టల మీదుగా మణుగూరు అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
10 లక్షల ఎకరాల్లో అడవి..
భద్రాద్రి జిల్లా అటవీ విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు కాగా, ఇందులో కిన్నెరసాని అభయారణ్యం 634.4 చదరపు కిలోమీటర్లుగా ఉంది. గొత్తికోయల ఆవాసాలు, రెండు లక్షల ఎకరాల్లో పోడు సాగు, మరో లక్ష ఎకరాల అడవిని నరికి వేయడంతో క్రమంగా విస్తీర్ణం తగ్గింది. దీంతో జిల్లాలో పులులు మనుగడ సాగించలేకపోతున్నాయి. అయితే గత ఆరేడేళ్లుగా ప్లాంటేషన్ పెంచడంతో క్రమంగా అడవి పెరుగుతోంది. 2018 తర్వాత జిల్లాలో పెద్దపులి ఆవాసం ఏర్పర్చుకోకపోగా, మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నా కొద్దిరోజులే జిల్లా దాటుతోంది. దీంతో రెండు నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. గొత్తికోయలు, గిరిజనులు వేటాకుండా అవగాహన కల్పించడంతో ఫలితం కనిపిస్తోంది. ఎట్టకేలకు రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించిన అధికారులు.. భద్ర అని నామకరణం చేశారు. ప్రస్తుతం మేటింగ్ సమయం కావడంతో ఆడ పులి కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈనెల 2వ తేదీన మణుగూరు అటవీ ప్రాంతంలో ట్రాపింగ్ కెమెరాకు మగ పులి మాత్రమే చిక్కిందని డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్ బుధవారం ధ్రువీకరించారు.
మణుగూరు అడవుల్లో
రెండు నెలలుగా పెద్దపులి మకాం
ట్రాపింగ్ కెమెరాలకు చిక్కిన బెబ్బులి
మూడేళ్ల తర్వాత కనిపించిన
అడుగుజాడలు
మగపులిగా నిర్ధారణ..
భద్ర అని నామకరణం
పులి ఇక్కడే ఉండేలా చర్యలు
జిల్లాలోని మణుగూరు అటవీ ప్రాంతంలో రెండు నెలలుగా పెద్దపులి మకాం వేసింది. జిల్లాకు ఉన్న కీర్తిప్రతిష్టల ఆధారంగా దానికి ‘భద్ర’గా నామకరణం చేశాం. ప్రజలెవరూ ఆందోళన చెందకుండా పులి కనిపిస్తే అటవీ అధికారులకు సమాచరం ఇవ్వాలి. అడవిలో నీటి వనరులను అందుబాటులోకి తీసుకొచ్చి పులులకు ఆహారమైన సాంబార్, జింకల సంతతి పెంపుపై దృష్టి పెట్టాం.
– కృష్ణాగౌడ్, భద్రాద్రి జిల్లా అటవీ శాఖాధికారి
![టైగర్..‘భద్ర’!1](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05kgm253-192026_mr-1738780849-1.jpg)
టైగర్..‘భద్ర’!
Comments
Please login to add a commentAdd a comment