జిల్లా జైలును పరిశీలించిన న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

జిల్లా జైలును పరిశీలించిన న్యాయమూర్తి

Published Thu, Feb 6 2025 12:11 AM | Last Updated on Thu, Feb 6 2025 12:11 AM

జిల్ల

జిల్లా జైలును పరిశీలించిన న్యాయమూర్తి

ఖమ్మంరూరల్‌: మండలంలోని రామన్నపేటలో జిల్లా జైలును న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్‌ బుధవారం పరిశీలించారు. జైలులోని బ్యారక్‌లను పరిశీలించిన ఆయన ఖైదీలతో మాట్లాడి వారికి ఇస్తున్న ఆహారం, అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే, మహిళా ఖైదీలకు సత్యమార్గం యూత్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యాన పేపర్‌ బ్యాగ్‌ల తయారీలో ఇస్తున్న శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో ఉంటూ శిక్షాకాలం ముగిశాక స్వయం ఉపాధి పొందాలని సూచించారు. జైలు సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, జైలర్‌ లక్ష్మినారాయణ, యూత్‌ సర్వీసెస్‌ సభ్యులు శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ ధాన్యం కొనుగోళ్లు

వైరా, బోనకల్‌ మండలాల్లో అనుమతి

ఖమ్మంసహకారనగర్‌: జిల్లాలోని వైరా, బోనకల్‌ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. గతనెల 31వ తేదీతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని అధికారులు ప్రకటించారు. ఈమేరకు జిల్లాలోని 344 కేంద్రాల ద్వారా 51,283 మంది రైతుల నుంచి 2,95,258.280 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. అయితే, వైరా మండలంలోని సిరిపురం, ఉప్పలమడక, బోనకల్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి, మోటమర్రి, కలకోట గ్రామాల్లో ఇంకా ధాన్యం మిగలగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం అనుమతి జారీచేయగా ఆయా గ్రామాల్లో 15వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేశామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్‌ తెలిపారు.

నిర్వహణ లోపాలపై

జెడ్పీ సీఈఓ అసహనం

వైరారూరల్‌: మండలంలోని ముసలిమడుగులో తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నిర్వహణపై జెడ్పీ సీఈఓ దీక్షారైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీఓ ఆశలత, డీఎల్‌పీఓ రాంబాబుతో కలిసి ఆమె గురుకులాన్ని తనిఖీ చేయగా వంట గది, స్టోర్‌ రూమ్‌లను పరిశీలించారు. వంట గది అపరిశుభ్రంగా ఉండడం, నాణ్యత లేని కూరగాయలు కనిపించడంతో పాటు పాఠశాల ఆవరణలో దుర్వాసన వస్తుండగా ప్రిన్సిపాల్‌ మాధవీలతను ప్రశ్నించారు. నిర్వహణ లోపాలపై మందలించిన సీఈఓ, ఇకనైనా విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, పరిశుభ్రతపై దృష్టి సారించాలని ఆదేశించారు.

నేడు విద్యుత్‌

వినియోగదారుల సదస్సు

ఏన్కూరు: విద్యుత్‌ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా గురువారం సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ వినియోగదారుల ఫోరం చైర్‌పర్సన్‌ ఎన్‌.వీ.వేణుగోపాలచారి తెలిపారు. ఏన్కూరులోని సబ్‌స్టేషన్‌లో ఉదయం 10–30నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సదస్సు జరుగుతుందని వెల్లడించారు. ట్రాన్స్‌ఫార్లలో లోపాలు, లో ఓల్టేజీ, నూతన సర్వీసుల మంజూరు, పేరు మార్పిడి, బిల్లుల్లో హెచ్చుతగ్గులు తదితర సమస్యలపై రాతపూర్వకంగా పిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఏన్కూరు, తల్లాడ మండలాల వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.

పలు రైళ్ల రద్దు..

ఇంకొన్ని దారి మళ్లింపు

ఖమ్మం రాపర్తినగర్‌: మూడో లైన్‌ నిర్మాణ పనుల కారణంగా ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాజీపేట – విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈనెల 10నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకొన్నింటిని సికింద్రాబాద్‌ – నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు వెల్లడించారు. అలాగే, వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
జిల్లా జైలును పరిశీలించిన న్యాయమూర్తి
1
1/2

జిల్లా జైలును పరిశీలించిన న్యాయమూర్తి

జిల్లా జైలును పరిశీలించిన న్యాయమూర్తి
2
2/2

జిల్లా జైలును పరిశీలించిన న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement