![ప్రణాళికతో చదివితే విజయం సులువే...](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05ckm283-191049_mr-1738780849-0.jpg.webp?itok=vwHo6zG6)
ప్రణాళికతో చదివితే విజయం సులువే...
● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ● ఎన్నెస్పీ క్యాంప్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన
ఖమ్మంసహకారనగర్: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాక ప్రణాళికాయుతంగా చదివితే విజయం సులువుగా సొంతమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సమీపిస్తున్న నేపథ్యాన బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సుకు హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయాన వేగంగా వెళ్తే ప్రమాదం జరుగుతుందనే భయం ఉండడం సహజమే అయినా ఆ భయాన్ని ఎలా అధిగమించాలో గుర్తించాలన్నారు. అదేమాదిరి పరీక్షల వేళ భయం తగ్గేందుకు ప్రణాళికతో చదవాలని సూచించారు. రానున్న నెల పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పరీక్షకు సిద్ధమైతే ఆటంకాలను అధిగమించవచ్చని కలెక్టర్ తెలిపారు. తొలుత మోటివేషన్ స్పీకర్ నాగేశ్వరరావు ప్రసంగాన్ని కలెక్టర్ విద్యార్థులతో కలిసి కూర్చుని విన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి సోమశేఖరశర్మ, పాఠశాల హెచ్‌ఎం రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మహిళా ప్రాంగణం అభివృద్ధికి నిధులు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లిలోని జిల్లా మహిళా ప్రాంగణం అభివృద్ధి, సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయిస్తామని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపా రు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థినులు ఇటీవల ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఏఎన్‌ఎం) కోర్సులో రాష్ట్ర, జిల్లా స్థా యి ర్యాంకులు సాదించగా కలెక్టర్ ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఉన్న వసతులు, తరగతి గదులను పరిశీలించడమే కాక రాష్ట్రస్థాయిలో మొద టి, రెండో ర్యాంకులు సాధించిన పావని, ఎస్.మనీల తదితరులకు జ్ఞాపికలు అందజేశారు. ఆతర్వాత వారితో కలిసి భోజనం చేశారు. ఈమేరకు మౌలిక సదుపాయాలపై మేనేజర్ వేల్పుల విజేత వివరించగా త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఉద్యోగులు నాగ సరస్వతి, స్పందన, హిమబిందు, మల్లిక, విజయ్‌కుమార్, సుకన్య, మౌనిక, లాలయ్య, పల్లవి, దుర్గారావు, శాంతమ్మ, కళ్యాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment