తల్లీకుమారుడికి జీవిత ఖైదు
ఖమ్మంలీగల్: వివాహితను హత్య చేసినట్లు తేలడంతో ముదిగొండ మండలం బాణాపురం తండాకు చెందిన ఆమె భర్త తేజావత్ ఉపేందర్‌నాయక్, అత్త తేజావత్ పద్మకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలారం తండాకు చెందిన భూక్యా కాలియా తన కుమార్తె కల్యాణిని రూ.4.50 లక్షల కట్నం ఇచ్చి ఉపేందర్‌తో 2017లో వివాహం జరిపించాడు. ఏడాది పాటు కాపురం సజావుగానే సాగగా వీరికి కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ఉపేందర్ మంగాపురం తండాకు చెందిన ఇస్లావత్ అరుణతో వివాహేతర సంబంధం పెట్టుకుని అదనపు కట్నం తీసుకురావాలని కల్యాణిని వేధించసాగాడు. ఆయనకు తల్లి పద్మ, తండ్రి కృష్ణ, సోదరి కవితతో పాటు అరుణ జత కలిసి కల్యాణిని వేధిస్తూ కూల్‌డ్రింక్‌లో విషం కలిపి చంపటానికి ప్రయత్నించగా తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. దీంతో పెద్దల సమక్షాన మాట్లాడి ఆగస్టు 2019లో పొలం అమ్మి విడతల వారీగా రూ.12 లక్షల వరకు చెల్లించారు. అయితే, 2020 ఫిబ్రవరి 12న కాలియాకు ఫోన్ చేసిన ఉపేందర్ కల్యాణి కళ్లు తిరిగి కింద పడిందని చెప్పగా వెళ్లేసరికి గొంతు, రెండు కాళ్లపై గాయాలు ఉండటంతో హత్య చేసినట్లు గుర్తించాడు. ఈ మేరకు ఉపేందర్, ఆయన తల్లిదండ్రులు పద్మ, కృష్ణ, మంగాపురం తండాకు చెందిన అరుణ, ముదిగొండకు చెందిన దారా కవిత తన కుమార్తెను హత్య చేశారని ఫిర్యాదు చేయగా పోలీసులు ఐదుగురిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 21 మంది సాక్షులను న్యాయమూర్తి విచారించగా కల్యాణి భర్త ఉపేందర్, ఆయన తల్లి పద్మపై నేరం రుజువైనందున యావజ్జీవ శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురిపై కేసు కొట్టేశారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.శంకర్ వాదించగా లైజన్ అధికారులు శ్రీకాంత్, రషీద్, నాగేశ్వరరావు, ఏఎస్‌ఐ సూర్యనారాయణ కానిస్టేబుల్ ఆదినారాయణ హోంగార్డ్ యూసుఫ్ సహకరించారు.
వివాహిత హత్య కేసులో తీర్పు
Comments
Please login to add a commentAdd a comment