●ప్రత్యేక దృష్టి సారించిన కేఎంసీ కమిషనర్ ●కార్యాలయంలో వివిధ విభాగాల్లో పరిశీలన
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పరిపాలనను గాడిన పెట్టడంపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య చర్యలను వేగవంతం చేశారు. కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై వరుసగా వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఆయన ఒక్కో విభాగాన్ని చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఇటీవల పలువురు ఉద్యోగుల విభాగాలు మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇందులో కొందరు నూతన విభాగాల్లో చేరలేదని గుర్తించిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఎంసీ కార్యాలయంలోని ఇన్‌వార్డ్, పన్నుల వసూళ్ల డెస్క్, హెల్ప్ డెస్క్‌ను శుక్రవారం తనిఖీ చేసి ఉద్యోగుల సంఖ్య, హాజరు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. రెవెన్యూ పన్నుల విభాగానికి వెళ్లిన సమయాన బిల్ కలెక్టర్ల సంఖ్యపై ఆరా తీసిన కమిషనర్ అదనంగా ఉన్న వారిని క్షేత్ర స్థాయికి పంపించాలని ఆదేశించారు. కాగా, హెల్ప్ డెస్క్‌కు కేటాయించిన ఓ మహిళా ఉద్యోగి చేరలేదని గుర్తించిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫైల్ బయటకు వెళ్లడంపై ఆగ్రహం, కేసు నమోదు
మూడు రోజుల క్రితం ఇంజనీరింగ్ విభాగం నుంచి కానరాకుండా పోయిన కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఓ ఫైల్ వర్క్ ఇన్‌స్పెక్టర్ వద్ద లభించగా, ఆ ఫైల్‌ను అటెండర్ తీసి ఇచ్చినట్లు సీసీ కెమెరాల పుటేజీ ద్వారా గుర్తించారు. దీంతో అటెండర్‌ను సస్పెండ్ చేసిన కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో కేఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్.కే.యాకూబ్ వలీ ఫిర్యాదు మేరకు గ్యాంగ్ కూలీ(అటెండర్) కె.రాజేశ్వరి, కాంట్రాక్టర్ హరిప్రసాద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీకాంత్‌పై ఖమ్మం టు టౌన్ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment