![అనీమియాపై అవగాహన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07wra02-191063_mr-1738953513-0.jpg.webp?itok=RNyL6Qmw)
అనీమియాపై అవగాహన
వైరా: వైరా మండలం ముసలిమడుగులోని గిరిజన సాంఘిక సాంక్షేమ బాలికల పాఠశాలలో సికిల్ సెల్ అనీమియాపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో కళావతిబాయి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చంద్రునాయక్, ఎన్‌హెచ్‌ఎం జిల్లా ప్రోగ్రాం అధికారి దుర్గ కలిసి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేయడమే కాక అనీమియాపై అవగాహన కల్పించారు. అలాగే, పలువురు విద్యార్థినుల నుంచి రక్తనమునాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శిరీష, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం పాత డీఆర్‌డీఏ కార్యాలయ ప్రాంతంలో గంజాయి విక్రయిసున్న ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారు. రమణగుట్ట ప్రాంతానికి చెందిన కొట్టే ప్రవీణ్, రాపర్తినగర్‌కు చెందిన పసుపులేటి సత్యనారాయణ, గొడుగు సాయిరాం గంజాయి విక్రయిస్తున్నారనే తనిఖీలు చేపట్టి 746 గ్రాముల గంజాయి, మూడు ఫోన్లు, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఈమేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూ టౌన్ పోలీసులు తెలిపారు.
ద్విచక్రవాహనం చోరీ
కామేపల్లి: మండలంలోని పండితాపురానికి చెందిన యర్రనాగుల వెంకటేశ్వర్లుకు చెందిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఆయన శుక్రవారం తన ఇంటి ముందు బైక్‌ను పార్క్ చేసి కాసేపటికి చూడగా కనిపించలేదు. దీంతో ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కూలికి వెళ్లొచ్చే సరికి...
చింతకాని: మండలంలోని నాగులవంచలో పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన మేడ దివ్య – రాములు దంపతులు గురువారం ఇంటి తలుపుకు తాళం వేయకుండా గురువారం ఉదయం కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి తలుపులు తీసి ఉండడంతో పరిశీలించగా బీరువాలో దాచిన 30 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈమేరకు దివ్య శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
మిల్లులో ధాన్యం బస్తాలు చోరీ
కల్లూరు: కల్లూరులోని శ్రీరామ రైస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో చోరీ జరిగింది. మిల్లును గురువారం రాత్రి 8గంటల సమయాన మూసేసి వెళ్లగా, శుక్రవారం ఉదయం వచ్చేసరికి ధాన్యం బస్తాల్లో ఆరింటిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు యజమానులు గుర్తించారు. ఈమేరకు యజమాని బండారు భద్రయ్య ఫిర్యాదుతో మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
పెనుబల్లి: మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న రెండు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండాలపాడుకు చెందిన రావిలాల పవన్‌సాయి తన చెల్లెలి స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి లంకపల్లిలో బస్సు ఎక్కించాడు. అక్కడి నుంచి ఇంటికి వస్తుండగా గ్రామశివారులో ఖమ్మం వైపు వెళ్లుతున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టగా పవన్‌సాయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు పెనుబల్లిలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. అలాగే, పెనుబల్లి కి చెందిన వేముల కృష్ణయ్య పొలం నుంచి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా పెనుబల్లి వద్ద జాతీయ రహదారిపై కొత్తగూడెం నుండి తిరువూరు వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడైన కృష్ణయ్యకు గాయాలు కావడంతో పెనుబల్లి ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించాక ఖమ్మం తరలించారు.
టిప్పర్ లారీ బోల్తా
మధిర: మధిరలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం టిప్పర్ లారీ బోల్తా పడింది. రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులకు మట్టి తీసుకొస్తున్న టిప్పర్ బ్రిడ్జి వద్ద భగీరథ పైప్‌లైన్ మరమ్మతులకు తవ్విన గోతిలో పడడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
చింతకాని: మండలంలోని నాగులవంచలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గ్రామ సమీప చెరువు కట్టపై పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసి వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment