ముగ్గురి హత్య కేసులో జీవితఖైదు
● మద్యంలో విషం కలిపిన నిందితుడు ● చంద్రుతండా ఘటనలో తీర్పు వెలువరించిన కోర్టు
ఖమ్మం లీగల్: తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో భూమి గొడవలు, ఇతర తగాదాల నేపథ్యాన మద్యంలో విషం కలిపి ముగ్గురి మృతికి కారణమైన వ్యక్తికి జీవితకాలం శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. ఎస్సీ, ఎస్టీ జిల్లా ప్రత్యేక న్యాయస్థానం న్యాయాధికారి డి.రాంప్రసాద్ మంగళవారం ఇచ్చిన ఈ తీర్పు వివరాలిలా ఉన్నాయి.
కర్మకు పిలిచి మద్యం తాగించి
చంద్రుతండాకు చెందిన బోడ భిక్షం కుటుంబానికి బోడ మల్సూర్ కుటుంబానికి పొలం పంచాయితీతో పాటు ఇతర గొడవలు ఉన్నాయి. కాగా, భిక్షం కుమారుడు అర్జున్ మృతి చెందగా 2021 ఆగస్టు 14న కర్మకాండ నిర్వహించారు. మధ్యాహ్నం గ్రామస్తులందరినీ విందుకు పిలవగా సాయంత్రం సైతం మరికొందరిని ఆహ్వానించారు. ఈక్రమంలోనే బోడ హరిదాసు, ఆయన సోదరుడు మల్సూర్, మరో సోదరుడి కుమారుడు భద్రు పొలానికి వెళ్లొచ్చాక భోజనానికి చేరుకున్నారు. అయితే, భిక్షం మరో కుమారుడైన బోడ చిన్నా అలియాస్ బిచ్చా భోజనానికి ముందు మద్యం పోయడంతో ముగ్గురూ తాగారు. ఆపై పావుగంటకే వారు ముగ్గురూ మద్యంలో విషం కలిసిందని అరుస్తూ పడిపోయారు. దీంతో మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తీసుకొస్తుండగా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నాతో పాటు మరో నలుగురిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇరవై మంది సాక్షులను విచారించి మొదటి ముద్దాయి అయిన చిన్నాపై నేరం రుజువైందని ప్రకటిస్తూ నలుగురిపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా న్యాయమూర్తి వెల్లడించారు. ఈక్రమాన చిన్నాకు జీవితకాలం జైలుశిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.కృష్ణమోహన్‌రావు వాదించగా పోలీసు శాఖ ఉద్యోగులు శ్రీకాంత్, నాగేశ్వరరావు, భద్రాజీ, పాషా సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment