క్రీడలతో కొత్త ఉత్తేజం, ఉత్సాహం
ఖమ్మంలీగల్: అటు కేసులు, ఇటు కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమయ్యే మహిళా న్యాయవాదులు క్రీడలపై దృష్టి సారించి పోటీల్లో పాల్గొనడం ద్వారా కొత్త ఉత్తేజం, ఉత్సాహం సమకూరుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా పేర్కొన్నారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో తాళ్లూరి సాహస్ చౌదరి మెమోరియల్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మహిళా న్యాయవాదుల క్రీడాపోటీలను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి అవసరమని, క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయని తెలిపారు. అంతేకాక ఆటలతో సృజనాత్మక, నైపుణ్యం వెలుగులోకి వస్తాయని, మానవ సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. మూడేళ్లుగా మహిళా న్యాయవాదులకు రాష్ట్రస్థాయిలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్న న్యాయవాది తాళ్లూరి దిలీప్‌ను అభినందించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ మాట్లాడగా జస్టిస్ నందా మహిళా న్యాయవాదులతో కలిసి సరదాగా కబడ్డీ, రింగ్, త్రోబాల్ ఆడి ఉత్సాహపరిచారు. కాగా, క్రీడాకారులకు ఇటీవల మృతిచెందిన న్యాయవాది చల్లా శంకర్ జ్ఞాపకార్థం టీ షర్ట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కె.ఉమాదేవి, ఎం.అర్చనాకుమారి, శ్రీనయ్య, బి.రాంప్రసాదరావు, కే.వీ.చంద్రశేఖరరావు, ఎం.కల్పన, కాసరగడ్డ దీప, బిక్కం రజని, ఏపూరి బిందుప్రియ, శివరంజని, వినుకొండ మాధవి, బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ, ఫెడరేషన్ ఆఫ్ బార్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్‌తో పాటు దిరిశాల కృష్ణారావు, బిచ్చాల తిరుమలరావు, రావుల వెంకట్, లలిత తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ సూరేపల్లి నందా
ఖమ్మంలో మహిళా న్యాయవాదుల క్రీడాపోటీలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment