● ఆదాయపు పన్ను పరిధి పెంపుతో వేతన జీవులకు ఊరట ● అంగన్‌వాడీ కేంద్రాలకు హంగులు, పాఠశాలల్లో ల్యాబ్‌లతో డిజిటల్ బోధన ● యూనివర్సిటీ, ‘సీతారామ’కు జాతీయ హోదాపై నిరాశే ● ప్రస్తావనే లేని గూడెం ఎయిర్‌పోర్ట్, నూతన హైవేలు
పార్లమెంట్‌లో శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కొన్ని అంశాలతో వివిధ రంగాలకు చెందిన వారు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఇంకొందరు మాత్రం అటు రాష్ట్రం, ఇటు జిల్లాకు కూడా ఎలాంటి ప్రయోజనం కలగలేదని పెదవి విరుస్తున్నారు. అంతేకాక బడ్జెట్ ఘనంగానే ఉన్నా అమలుపై అనుమానాలు వ్యక్తం
చేస్తున్నారు. గత రెండు బడ్జెట్లలో ఉద్యోగులు, మధ్య తరగతి వర్గాలకు నిరాశ ఎదురుకాగా.. ఈసారి మాత్రం ఆదాయ పన్ను పరిమితి
పెంచడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయడం విశేషం. ఆయా అంశాల్లో దేశమంతటితో పాటు జిల్లాకు లబ్ధి జరగనుండగా.. జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి
కేటాయింపులు చేయకపోవడం నిరాశను మిగిల్చినట్లయింది. ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటుచేయాలన్న ఏళ్ల నాటి డిమాండ్‌ను
పట్టించుకోకపోగా.. సీతారామ ప్రాజెక్టుకు జాతీయ హోదాపైనా
రిక్తహస్తమే చూపారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
1.20లక్షల మందికి లబ్ధి
ఆదాయపు పన్ను విషయమై కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చారు. గతంలో ఉన్న స్లాబ్‌ల్లోనూ మార్పులు చేశారు. రూ.4లక్షల వరకు ఎలాంటి పన్ను లేకపోగా, రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు 5శాతం, రూ.8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10శాతం, రూ.12 లక్షల నుంచి రూ.16లక్షల వరకు 15శాతం, రూ.16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20శాతం, రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం చెల్లించాలి. ఇక ఆపైన ఆదాయం వచ్చే వారికి 30 శాతం పన్ను ఉంటుంది. అయితే, కొత్త పన్ను విధానంతో స్టాండర్డ్ డిడక్షన్‌తో రూ.12.75 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరముండదు. ఈ విధానంతో జిల్లాలో ఉన్న దాదాపు 1.20 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట కలగనుంది. ఇక కొద్ది మొత్తంలో పన్ను చెల్లించేవారికి టీడీఎస్ విధానంతో మేలు చేకూరుతుందని భావిస్తున్నారు.
రంగాల వారీగా ఇలా...
●వైద్య రంగంలో డే కేర్ కేన్సర్ల ఏర్పాటులో భాగంగా జిల్లాకు సెంటర్ మంజూరు కానుంది.
●మెడికల్ సీట్ల పెంపుతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోనూ మరింత మంది విద్యార్థులకు అవకాశం దక్కుతుంది.
●జిల్లాలో 1,216 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 83,296 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలకు మరింత వన్నెలద్దేలా బడ్జెట్ కేటాయించచడంతో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. అలాగే విద్యారంగంలో ఏఐని ప్రవేశపెట్టనుండడంతో ప్రభుత్వ విద్యార్థులకు డిజిటల్ శిక్షణ అందుతుంది.
●గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీ కేంద్రాలు సైతం కొత్త హంగులను అద్దుకోనున్నాయి.
●వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అలాగే పండ్లు, కూరగాయల ఉత్పత్తి పెంచేలా నూతన పథకం, పత్తి ఉత్పాదక పెంపునకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటుతో జిల్లాలోని రైతులకు లబ్ధి జరగనుంది. ఈ పథకాల ద్వారా జిల్లాలోని 3.42 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందనున్నారని తెలుస్తోంది.
●పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని నేలకొండపల్లిలో బౌద్ధక్షేత్రం, ఖమ్మంలో ఖిల్లా, లకారం ట్యాంక్‌బండ్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో కనకగిరి గుట్టల అభివృద్ధికి నిధులు కేటాయించింది. ప్రస్తుతం కేంద్రం నిర్ణయంతో ఈ ప్రాంతాలకే కాక పులిగుండాలకు కూడా మహర్దశ పట్టనుంది.
●అసంఘటిత రంగాల ఉద్యోగులకు (గిగ్ వర్కర్లు) బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. వీరికి గుర్తింపుతోపాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేలా ఈ–శ్రమ్ పోర్టర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కింద ఉద్యోగి కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందుతుంది. దీంతో జిల్లాలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మందికి మేలు చేకూరనుంది.
●పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ప్రకటించారు. ఇందులో భాగంగా నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటు చేయనుండగా స్టార్టప్ కంపెనీలకు ఇచ్చే సాయం కూడా పెంచనున్నారు. సుమారు 27 రంగాల్లో ఈ పథకం అమలుకానుండగా జిల్లాలో సొంతంగా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే వారికి చేయూత దక్కుతుంది. జిల్లాలో గ్రానైట్ ప్రధాన పరిశ్రమగా ఉన్న నేపథ్యాన రుణ సౌకర్యంతో మరింత అభివృద్ధి చెందనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment