శతాబ్ది ఉత్సవాలకు వేళాయె...
● రేపటి నుంచి అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ● వెల్లడించిన డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్
ఖమ్మం వన్‌టౌన్: ఖమ్మంలో అటవీశాఖ కార్యాలయం నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అటవీశాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ వెల్లడించారు. ఇందులో భాగంగానే సోమవారం నుంచి విద్యార్థులకు అటవీ ప్రాంతం, పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఖమ్మంలోని అటవీశాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీశాఖ కార్యాలయం 1925లో నిర్మించగా.. అప్పట్లో అతి పెద్దదైన ఖమ్మం అటవీశాఖ సర్కిల్ ద్వారానే తిరువూరు సర్కిల్ కార్యకలాపాలు సైతం కొనసాగేవని తెలిపారు.
‘ఫారెస్ట్ విజిట్’కు విద్యార్థులు
జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా మెగా ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతోందని డీఎఫ్‌ఓ వెల్లడించారు. ఇప్పటికే జమలాపురంలో ఎకో పార్క్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారన్నారు. అలాగే, తల్లాడ రేంజ్ పరిధి కనకగిరి కొండల వద్ద పులిగుండాల ఎకో టూరిజంను ఫిబ్రవరి 15న ప్రాథమికంగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాగా, శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వన దర్శిని పేరుతో రోజుకు 300 మంది చొప్పున సుమారు 7వేల మంది విద్యార్థులను అటవీ ప్రాంతం సందర్శనకు తీసుకెళ్తామన్నారు. కనకగిరి కొండల వద్ద పక్షులు, వన్యప్రాణుల సర్వే జరుగుతున్నందున వీటితో పాటు వృక్ష, జంతుజాతులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య, జెడ్పీ సీఈఓ దీక్షా రైనాతో కలిసి పులిగుండాల ప్రాజెక్టును సందర్శించి అభివృద్ధి పనులపై చర్చించామని వెల్లడించారు. కాగా, శతాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా ఫారెస్ట్ కాంప్లెక్స్‌లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న, రిటైర్డ్ అయిన ఉద్యోగులను భాగస్వాములను చేస్తామని డీఎఫ్‌ఓ తెలిపారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీఓలు మంజుల, కృష్ణారావు, ఎఫ్‌ఆర్‌ఓలు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment