ఎన్నికల సిబ్బందితో ఈ నెల 15న నిర్వహించిన సమావేశంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ వెనక హెచ్‌హెచ్‌పీ రాజశేఖర్(కలెక్టర్ అనధికారిక సీసీ)
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లా కలెక్టరేట్‌లో కంప్యూటర్ ఆపరేటర్లే పరిపాలన కొనసాగిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం అధికారవర్గాల నుంచే వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు సైతం వారి మీదే ఆధారపడటంతో అనధికారికంగా వారు(కంప్యూటర్ ఆపరేటర్లు) క్యాంప్ క్లర్క్‌ల హోదాల్లో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. జిల్లా సర్వోన్నతాధికారి సైతం వారికి వత్తాసు పలుకుతుండటం కొసమెరుపు. దీంతో కలెక్టరేట్‌లో అనధికారిక సీసీల ఇష్టారాజ్యం నడుస్తోందన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
‘అర్హత లేకున్నా అందలం’ శీర్షికతో గత నెలలో ‘సాక్షి’ అనధికారిక సీసీలపై కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనానికి కలెక్టర్ స్పందిస్తూ.. తన వద్ద పనిచేస్తున్న రాజశేఖర్(అనధికారిక సీసీ) హ్యాండ్ హోల్డింగ్ పర్సన్(హెచ్‌హెచ్‌పీ) కేవలం కంప్యూటర్ విధులకు మాత్రమే అతని సేవలు వినియోగిస్తున్నామన్నారు. అదేవిధంగా ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్‌వో వద్ద పనిచేస్తున్న కార్తీక్, షఫీ, జావీద్ కూడా కంప్యూటర్ ఆపరేటర్లుగానే సేవలందిస్తున్నారని అప్పట్లో స్పష్టం చేశారు. అయితే వారు ఏనాడు కంప్యూటర్ విధుల్లో పనిచేసిన దాఖలాలు కనిపించలేదని కలెక్టరేట్ వర్గాల నుంచే విమర్శలు వినిపించాయి. ఇటీవల ఓ అనధికారిక సీసీ ఏకంగా జిల్లా అధికారులతో రివ్యూ చేసినట్లు సమాచారం.
‘ఉన్నతాధికారి లేకుండా ఇదేం రివ్యూ రా బాబు’ అంటూ సమావేశంలో పాల్గొన్న అధికారులు తల పట్టుకొన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ స్పష్టం చేసినట్లుగా రాజశేఖర్ కంప్యూటర్ విధులేమీ నిర్వహించడం లేదని సమాచారం. అతను మళ్లీ కలెక్టర్ సమావేశాల్లో పాల్గొంటుండడం గమనార్హం. కలెక్టర్ ఎక్కడికి వెళ్లినా అతను తప్పకుండా వెంట వెళ్తున్నారు. కలెక్టర్‌కు అన్నీ అతనే అన్నట్లుగా వ్యవహారం నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), అదనపు కలెక్టర్(రెవెన్యూ), డీఆర్‌వోల వద్ద కంప్యూటర్ ఆపరేటర్ పేరిట విధులు నిర్వహిస్తున్న కార్తీక్, షఫీ, జావీద్‌లు సైతం అనధికారిక సీసీలుగా కొనసాగుతుండడం విశేషం.
మంగళవారం సైతం గంగాపూర్ పర్యటనలో కలెక్టర్ వెంట రాజశేఖర్, కాగజ్‌నగర్ పర్యటనలో అదనపు కలెక్టర్ దాసరి వేణు వెంట షఫీ పాల్గొన్నారు. నిజంగా వారిని కంప్యూటర్ విధులకే వినియోగిస్తుంటే వారిని తమ వాహనాల్లో ఉన్నతాధికారులు ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కాని ప్రశ్నగా నిలుస్తోంది. వాస్తవానికి అధికారిక సీసీలు ఉన్నప్పటికీ వారి సేవలు పెద్ద వినియోగించుకోకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వారిపై ఉన్నా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కలెక్టరేట్‌లో ఇష్టారాజ్యానికి అద్దం పడుతోంది.
అధికార దుర్వినియోగం...
కలెక్టరేట్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి. అలాగే ఆసిఫాబాద్ ఆర్డీవో, పదిహేను మండలాల తహసీల్దార్లకు సంబంధించిన వాహనాలకు సర్కారు అద్దె చెల్లిస్తోంది. అయితే గత రెండు నెలలుగా అదనపు కలెక్టర్(రెవెన్యూ) దాసరి వేణు మాత్రం ప్రభుత్వ వాహనానికి బదులుగా ఒక ప్రైవేటు వాహనాన్ని వినియోగిస్తున్నారు. అతని కోసం కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని జిల్లా కలెక్టర్ తీసుకున్నారు. అయితే ఆ వాహనాన్ని అతను అధికారి విధుల కోసం వినియోగించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తన సొంత పనులకు ఆ కారును వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్లేందుకు, ఇతరత్రా అవసరాలకు ప్రభుత్వ కారును వినియోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, జిల్లా సర్వోన్నతాధికారి వాహనాన్ని మరమ్మతుల కోసం హైదరాబాద్‌లోని షోరూంకి తరలించగా.. ఆయన మంచిర్యాలకు చెందిన మరో అద్దె కారును ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఈ వాహనం అద్దె సైతం సింగరేణి సంస్థ చెల్లిస్తోందని సమాచారం. అయితే ఆయనకు మరో కారు ఉండగా.. మళ్లీ అదనపు కలెక్టర్ కారును రెండు నెలలుగా వినియోగిస్తుండటంపై కలెక్టరేట్ ఉద్యోగవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, అదనపు కలెక్టర్ అద్దె వాహనాన్ని ఎందుకు వినియోగిస్తున్నారని కలెక్టరేట్‌లోని ఓ ముఖ్య అధికారిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. ఆ కారు రిపేర్‌లో ఉందని సమాధానం ఇవ్వడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment