ఆసిఫాబాద్ ఆర్టీఏ కార్యాలయం లోపల విశాలమైన టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్‌తోపాటు... పదుల సంఖ్యలో వాహనాలు నిలిపేందుకు స్థలం ఉంది. కానీ ఇక్కడి అధికారులు మాత్రం ఇటీవల ఒక్క వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడం విడ్డూరంగా ఉంది. ‘వాహనం ఏదైనా.. పనేదైనా.. అన్నీ గేటు బయటే’ అన్నట్లుగా వారి ధోరణి కనిపిస్తోంది. కార్యాలయం తలుపులు ఉదయం 10.30 గంటలకు తెరిచినప్పటి నుంచి వాహనదారులు బయటే వాహనాలను నిలిపి ఉంచాలని ఆర్టీఏ సిబ్బంది ఆదేశిస్తున్నారు. కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకుని చలానాలు కట్టేవారిని మాత్రమే ప్రధాన ద్వారం వద్ద ఉన్న చిన్న ద్వారం నుంచి లోపలికి పంపుతున్నారు. ఇక కార్లు, జీపులు, ట్రాక్టర్లు, లారీలు, ద్విచక్ర వాహనాలన్నీ గేటు ఎదుట రోడ్డు పొడువునా నిలిపి ఎదురుచూసే పరిస్థితి. ఉదయం నుంచి కార్యాలయంలోనే అధికారులు ఉన్నా.. నెమ్మదిగా మధ్యాహ్నం 12 గంటల తర్వాతగానీ బయటకు వచ్చి వాహనాలను తనిఖీ చేయడం లేదు. ఉదయం వచ్చిన వాహనదారులు ఎండలో వేచిచూస్తున్నారు. ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే మాత్రం వారి వాహనాన్ని చివరి వరకు తనిఖీ చేయకుండా చుక్కలు చూపిస్తున్నారని తెలుస్తోంది. ప్రశ్నించి ఇక్కట్లు పడడం ఎందుకన్న ధోరణి వాహనదారుల్లో కనిపిస్తోంది. బుధవారం మధ్యాహ్నం ‘సాక్షి’ ప్రతినిధి ఆర్టీఏ కార్యాలయం బయట వాహనాలు ఉంచి ఇంజిన్ నంబరు తదితర వివరాలను ఎంవీఐకి సిబ్బంది చెబుతున్న సందర్భంలో ఫొటోలు తీస్తుండగా.. ‘ఎవరు మీరు? ఎందుకు ఫొటో తీశారు?’ అంటూ ప్రశ్నించడమే కాకుండా... కార్యాలయంలోకి వెళ్తున్న ‘సాక్షి’ ప్రతినిధిని సైతం గేటు ముందే నిలబెట్టారు. డీటీవో లేరు..? మీరు లోపలికి వెళ్లేందుకు ముందుగా ఎంవీఐ అనుమతి పొందాలని ఆర్టీఏ కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగడం కొసమెరుపు. కార్యాలయం వెలుపల జరుగుతున్న ఈ వింత వైఖరిపై జిల్లా రవాణా శాఖ అధికారి రామంచంద్రను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘అలాంటిదేమీ తన దృష్టికి రాలేదు. గేటు బయటే వాహనాలను నిలిపి తనిఖీలు చేసిన సిబ్బంది వివరణ కోరుతా? వాహనదారులకు ఇకపై ఇక్కట్లు కలగకుండా చర్యలు తీసుకుంటాను.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment