● నూక అవుతోందంటూ సాకు ● జిల్లాలో 20 వేల ఎకరాల్లో 1262
కంకిపాడు: పండించిన పంట అమ్ముకునేందుకు రైతులు నానా పాట్లు పడాల్సి వస్తోంది. మిల్లర్లు పెడుతున్న కొర్రీలతో రైతులు వర్రీ అవుతున్నారు. 1262 రకం ధాన్యం సేకరణకు మిల్లర్లు నో చెబుతుండటంతో సమస్య తలెత్తుతోంది. ధాన్యం సేకరణ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించటంలో సర్కారు పూర్తిగా వైఫల్యం చెందుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంట మిల్లులకు పోక కల్లాల్లో ధాన్యం రాశులు కుప్పలుగా కనిపిస్తున్నాయి.
కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1.64 లక్షల హెక్టార్లలో వరి సాగు జరిగింది. బీపీటీ, ఎంటీయూ, ఇతర సాధారణ రకాలను రైతులు సాగుకు ఎంచుకున్నారు. ఇందులో 1262 రకం విత్తనం జిల్లాలో 20 వేల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం పంట కోత కోసి ధాన్యం మిల్లులకు తరలించేందుకు, కొన్ని చోట్ల పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి.
నూక అవుతుందంటూ నిరాకరణ..
1262 రకం వరి ధాన్యం గింజ సన్నగా ఉండటంతో మిల్లులో బియ్యం ఆడించే క్రమంలో నూక అవుతుందనే నెపంతో ఈ ఏడాది ఈ ధాన్యం సేకరించేందుకు కొందరు మిల్లర్లు మొండికేస్తున్నారు. ధాన్యం మిల్లుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నా మిల్లర్లు నుంచి గోనె సంచులు రావటం లేదు. వాహనాలను పంపించటం లేదు. మిల్లర్లు ఈ రకం ధాన్యం సేకరించేందుకు వెనుకాడటంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో మునిగిపోయారు. కోత కోయించిన ధాన్యం మిల్లులకు పోక కల్లాలు, రోడ్లపై రాశులుగా పోసి ఉంచారు.
గతంలో 1318 రకానికి..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్‌లో 1318 రకం ధాన్యాన్ని సేకరించేందుకు ఇదే విధంగా మిల్లర్లు నిరాకరించారు. నూక, ముక్క అవుతుందనే సాకు చెప్పారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మిల్లర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించటం, సమీక్షలు చేయటంలో సఫలీకృతం అయ్యారు. రైతులు పండించిన ప్రతి విత్తన రకం ధాన్యం సేకరించేలా చర్యలు తీసుకున్నారు. నిరంతరం మిల్లర్ల వద్ద తనిఖీలు చేపడుతూ ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవటంతో రైతు పండించిన పంట కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు సమర్థంగా తరలింది. తేమశాతం ఆధారంగా రైతుకు ధర దక్కింది. ఈ దఫా మాత్రం 1318 కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి.
కోలవెన్నులో సాగుచేసిన 1262 రకం వరి చేను
అంతా మొక్కుబడే..
ఈ దఫా ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైనా అధికారుల వ్యవహారం అంతా మొక్కుబడిగానే ఉంది. మిల్లర్ల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను అధికారులు గానీ, కూటమి నేతలు గానీ పట్టించుకోవడం లేదు. రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే) ద్వారా సేకరణను కూడా పర్యవేక్షించడం లేదు. అధికారులు, నాయకుల మధ్య సమన్వయం లేకపోవటం, ఇప్పటి వరకూ అధికారికంగా సమీక్షలు లేకపోవటంతో ఎవరికి వారే అన్నచందంగా సాగుతోంది. చివరికి అన్నదాతలకు నష్టం మిగులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment