స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత

Published Mon, May 6 2024 9:15 AM

స్ట్ర

పాణ్యం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని నంద్యాల కలెక్టర్‌ శ్రీనివాసులు ఆదేశించారు. ఆదివారం ఆయన ఎస్పీ రఘువీర్‌రెడ్డితో కలిసి పాణ్యంలోని ఆర్‌జీఎం, శాంతిరాం ఫార్మసీ, మెడికల్‌ కళాశాలలను పరిశీలించారు. నంద్యాల పార్లమెంట్‌ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతపై ఆరా తీశారు. గదుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంచాలన్నారు. కిటికీలు లేకుండా చూడాలని సూచించారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను తీసుకొచ్చే వాహనాల పార్కింగ్‌ను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు కూర్చునే స్థలంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, అడిషినల్‌ ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, డీఎస్పీ రవింద్రనాథ్‌రెడ్డి, సీఐ నల్లప్ప ఉన్నారు.

గ్యాస్‌ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

కోడుమూరు రూరల్‌: కోడుమూరు గుంతకంటి వీధిలోని ఓ ఇంట్లో గ్యాస్‌ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. గుంతకంటి వీధికి చెందిన రవి ఎప్పటిలాగే ఆదివారం ఉదయాన్నే పనులకు వెళ్లాడు. భార్య సుజాత తమ బంధువులకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటికి తాళం వేసి పిల్లలను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికొచ్చిన రవి ఇంటి తలుపులు తెరిచి గ్యాస్‌ వాసనను గమనించకుండా లైట్‌, ఫ్యాన్‌ వేశాడు. అప్పటికే ఇళ్లంతా గ్యాస్‌తో నిండిపోవడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో రవి తీవ్రంగా గాయపడ్డాడు. రవి ఇంటితో పాటు పక్క ఇంటి గోడలు బీటలువారాయి. వస్తువులు ధ్వంసమయ్యాయి. స్థానికులు రవిని కోడుమూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

హుబ్లీ–విజయవాడ రైల్లో చోరీ

బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్‌ఎస్‌ రంగాపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో సిగ్నల్‌ కోసం నిలిచిన హుబ్లీ–విజయవాడ రైలులో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు కర్నూలు రైల్వే సీఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు. నంద్యాల నుంచి డోన్‌ వైపు అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తుండడంతో హుబ్లీ రైలును ఆపారన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు రైలులోకి ప్రవేశించి మహిళా ప్రయాణికురాలి మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును చోరీ చేసినట్లు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు,

ట్రాక్టర్‌ ఢీకొని స్కూటరిస్టు మృతి

ఆస్పరి: మండలంలోని జొహరాపురం గ్రామ సమీపంలో ఆదివారం స్కూటర్‌ను ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఆస్పరి సీఐ హనుమంతప్ప వివరాల మేరకు.. మొలగవల్లి గ్రామానికి చెందిన కొట్టాల నారాయణస్వామి, మహాదేవప్ప ఆస్పరి నుంచి స్వగామానికి వెళ్తుండగా జొహరాపురం సమీపంలో పొలాల్లోని మట్టిని జొహరాపురానికి తీసుకొస్తున్న ట్రాక్టర్‌ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొట్టాల నారాయణస్వామి (45) అక్కడికక్కడే మృతి చెందాడు. మహాదేవప్ప గాయపడ్డారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గాయపడిన మహాదేవప్పను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద  పటిష్ట భద్రత
1/1

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత

Advertisement
Advertisement