నాటి ఆత్మీయతలు ఇప్పుడు లేవు
నాకు ఇప్పుడు 61 సంవత్సరాల వయస్సు. నా చిన్నతనంతో పోలిస్తే ఇప్పటి తరంలో అనుబంధాలు, ఆత్మీయతలు బాగా తగ్గిపోయాయి. మనసు విప్పి ఆత్మీయంగా పలకరించుకునే పరిస్థితి లేదు. పండుగలు, శుభకార్యాలని వస్తున్నా ఎవరి బిజీలో వారు ఉంటున్నారు. ఏదైనా కష్టమొస్తే ఆదుకునేవారు కరువయ్యారు. ఎదురుగా ఉన్న మనిషిని పలకరించడం కంటే కనిపించని మనుషులతో సోషల్ మీడియాలో కబుర్లు అధికమయ్యాయి. ప్రస్తుతం ఎవరికి వారు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇంట్లో పెద్దలున్నా వారిని వృద్ధాశ్రమాలకు పంపించేస్తున్నారు.
–డాక్టర్ బి. వెంకటేశ్వరరావు,
సీఎస్‌ఆర్‌ఎంవో, జీజీహెచ్, కర్నూలు
మనిషికి డబ్బే ముఖ్యమైంది
ఇప్పుడంతా డబ్బే ప్రధానంగా మారింది. మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. ఎదుటి మనిషిని ఎలా దోచుకోవాలన్న ఆలోచన ఎక్కువైంది. సమాజంలో ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఆనాటి అనుబంధాలు, ఆత్మీయతలు మళ్లీ చూస్తామన్నది కలగా మిగిలిపోతుంది. మానవ విలువలకన్నా మనిషికి డబ్బే ముఖ్యమై పోయింది. ఇందుకోసం ఏమి చేయడానికై నా వెనుకాడటం లేదు. శుభకార్యానికి పిలిస్తే వస్తారు గానీ కష్టమొస్తే పలకరించే దిక్కులేకుండా పోయింది. మళ్లీ పాత రోజులు రావాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా. – డాక్టర్ సి. మల్లికార్జున్,
సీనియర్ గైనకాలజిస్టు, కర్నూలు
కష్టమొస్తే పలకరించేవారు కరువయ్యారు
ఒకప్పుడు ఎవ్వరికై నా కష్టమొస్తే కుటుంబసభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు కూడా చేయందించేవారు. ఇప్పుడు సన్నిహితులకు కష్టమొస్తే వారి స్నేహితులు, బంధువుల్లో కూడా చాలా మంది పలకరించే సాహసం చేయడం లేదు. ఉన్నత చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తే మాత్రం మనుషులను దూరం చేసుకుంటున్నారు. సన్నిహితులైనా సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అయితే ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లోని మురికివాడల్లో మనుషుల మధ్య అభిమానాలు, ఆత్మీయతలు కనిపిస్తాయి.
– బాలకృష్ణ, రిటైర్డ్ ఉద్యోగి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment