
70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆరోగ్య బీమా
కర్నూలు(అర్బన్): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎంజేఏవై (ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన) వయో వందనలో భాగంగా 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాను వర్తింపజేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 02వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. మొబైల్ ఫోన్ అప్లికేషన్ (ఆయుష్మాన్ యాప్) లేదంటే వైబ్‌సైట్ పోర్టల్ beneficiary.nha.gov.inతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆయుష్మాన్ కార్డుల జారీకి ఆధార్ ఆధారిత ఈ–వేవైసీ తప్పనిసరి తెలిపారు. వన్‌టైం ఆప్షన్ ద్వారా ఈ పథకంలో చేరేందుకు అవకాశాన్ని కల్పిస్తారని పేర్కొన్నారు.
50 శాతం సబ్సిడీతో స్ప్రింక్లర్లు
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు 2025–26 సంవత్సరానికి సంబంధించి 50 శాతం సబ్సిడీతో స్ప్రింక్లర్లు అందజేయనున్నట్లు ఏపీఎంఐపీ అధికారులు తెలిపారు. అలాగే ఐదు ఎకరాలలోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఇందులో కేంద్రప్రభుత్వం వాటా 33 శాతం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం 67 శాతం భరిస్తుందని తెలిపారు. ఇతర సన్న, చిన్నకారు రైతులకు ఐదు ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం కల్పిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.
బాల్య వివాహాలు నేరం
● ఐసీడీఎస్ పీడీ పి.నిర్మల
కర్నూలు(అర్బన్): బాల్య వివాహాలు చేయడం నేరమని, చట్టం ప్రకారం రూ.లక్ష జరిమానాతో పాటు రెండు సంవత్సరాల శిక్ష ఉంటుందని ఐసీడీఎస్ పీడీ పి.నిర్మల పేర్కొన్నారు. బి.క్యాంప్‌లోని ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 102 సచివాలయాల మహిళా పోలీసులు, అర్బన్ ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కిశోర బాలికల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి సచివాలయంలో మహిళా పోలీసులను నియమించారన్నారు. అర్బన్ సీడీపీఓ అనురాధ మాట్లాడుతూ.. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమస్యలు వస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి తెలియజేయాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి టి.శారద అన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, డీసీపీయూ సిబ్బంది శ్వేత, కీర్తి, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
డీబీసీడబ్ల్యూఈఓగా కె.ప్రసూన
కర్నూలు(అర్బన్): జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణిగా కె.ప్రసూనను నియమిస్తూ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జున ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ సంక్షేమ శాఖలో ఇటీవల జరిగిన పదోన్నతుల్లో భాగంగా ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో సహాయ బీసీ సంక్షేమాధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రసూనకు డీబీసీడబ్ల్యూఈఓగా పదోన్నతి కల్పిస్తూ కర్నూలుకు నియమించారు. ఇక్కడ రెగ్యులర్ డీబీసీడబ్ల్యూఈఓగా విధులు నిర్వహించిన పి.వెంకటలక్షుమ్మను నెల్లూరుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు ఇన్‌చార్జి డీబీసీడబ్ల్యూఈఓగా వ్యవహరించారు. ప్రసూన ఈ నెల 7, 8 తేదిల్లో ఇక్కడ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
డైట్ కాలేజీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: ప్రభుత్వ డైట్ కాలేజీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఫారిన్ సర్వీస్ కింద డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఖాళీల వివరాలు www.deokml13.blogspot.comలో చూసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తూను హెచ్‌ఎం, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓలతో ధ్రువీకరించి, బి.తాండ్రపాడులోని ప్రభుత్వ డైట్ కాలేజీలో అందజేయాలన్నారు.

70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆరోగ్య బీమా