మహబూబాబాద్: కడుపేదరికం.. రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం.. కూలీకి వెళ్తేనే కూడు. లేనిపక్షంలో కుటుంబ మొత్తం ఆకలికి అలమటించుడే. ఇలాంటి పరిస్థితి ఉన్నా ఓ విద్యార్థి పట్టుదలతో చదివాడు. అనుకున్న లక్ష్యం చేరుకున్నాడు. అయితే ఉన్నత చదువుకు లక్ష్మీ కటాక్షం లేక ఓ నిరుపేద విద్యార్థి ఇబ్బందులు పడుతున్నాడు. ఎవరైన ఆర్థిక సాయం అందిస్తే ఉన్నతంగా చదువుకుంటానని పేర్కొంటున్నాడు.
దాతల సాయం కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బాపునగర్ గ్రామానికి చెందిన మంతెన ప్రభుదాస్, స్వప్న దంపతులకు ముగ్గురు కుమారులు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. వ్యవసాయ కూలి పనులకు వెళ్లి కుమారులను పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు సన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు చదువుకున్నాడు.
5వ నుంచి 10వ తరగతి వరకు మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ ఎంపీసీ రాంపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. బీటెక్ చదవడానికి ఎంసెట్ రాశాడు. అలాగే, జేఈఈ మెయిన్స్ రాయడంతో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నిట్ కళాశాలలో ప్రవేశం వచ్చినట్లు మెయిల్‌ద్వారా సమాచారం పంపించారు. దీంతో తనను ఎలాగైనా చదివించాలని తల్లిదండ్రులను ఒప్పించాడు. అప్పుతెచ్చి రూ. 20 వేలు ప్రవేశం కోసం ఆన్‌లైన్ ఫీజు చెల్లించారు. కళాశాలలో చేరగానే మరో రూ. 36 వేలు చెల్లించాలని తెలిపినట్లు చెప్పారు.
అంతేకాకుండా సుమారు రూ. లక్షకు పైగా ఖర్చు అవుతుందని, చేతిలో డబ్బు లేక చదువు ఆపేయాల్సి వస్తుందని విద్యార్థి సన్నీ మనోవేదన చెందుతున్నాడు. పట్టుదలతో చదవగా సీటు వచ్చినా లక్ష్మీకటాక్షం లేకపోవడంతో కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 10 తేదీ వరకు కళా శాలలో చేరాలని సమాచారం అందించడంతో వారికి వేదన ఎక్కువైంది.
దీనిపై దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని సన్నీతోపాటు తల్లిదండ్రులు వేడుకుకుంటున్నారు. దాతలు 9052001950 ప్రభుదాస్, చెన్నారావుపేట ఎస్‌బీఐ అకౌంట్ నంబర్ 62202764705, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్ 0021352 కి సాయం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment