వరంగల్: అనారోగ్యంతో బాధపడుతున్న నానమ్మను చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి ఆటోలో వెళ్తున్న ఓ బాలుడిని మృత్యువు.. నిద్ర రూపంలో కబలించింది. ఈ ఘటన శనివారం జిల్లా కేంద్రంలో జరిగింది. పాలకుర్తి మండలం మల్లంపల్లికి చెందిన ఇమామ్ పాషా, భార్య కర్మిషా బతుకుదెరువు నిమిత్తం ఘట్‌కేసర్‌కు వెళ్లారు. అక్కడే పాషా ఆటో నడిపించుకుంటూ.. కుమారుడు షరీఫ్(8), ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటున్నాడు.
రెండో శనివారం స్కూల్ లేకపోవడంతో తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో భార్య, బిడ్డలతో కలిసి పాషా సొంత ఆటోలో బయలు దేరాడు. జనగామ పట్టణంలోని కళ్లెం కమాన్ వద్దకు రాగానే.. ముందు సీటులో ఉన్న బాలుడు షరీఫ్ కునుకు తీయడంతో ఆటో నుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అటుగా వెళ్తన్న ఓ కారు ప్రయాణికులు.. బాబును వెంటనే జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తీసుకొచ్చిన అరగంట లోపే బాలుడు మృతి చెందాడు.
రోదనలతో మిన్నంటిన ఆస్పత్రి..
బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. బాధితుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. బాలుడు షరీఫ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించగానే.. తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు. మృతుడి ఇద్దరు చెల్లెళ్లు.. అన్నా మాట్లాడు అంటూ విగత జీవిగా ఉన్న తమ సోదరుడిని తట్టి లేపుతుంటే అక్కడే ఉన్న పేషెంట్లు, వైద్యులు కన్నీరు కార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment