
మహబూబాబాద్: రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని, బీఆర్‌ఎస్‌ను గద్దె దించడం ఖాయమని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో జగిరిన రైతు గోస.. బీజేపీ భరోసా సభకు పరకాల, వరంగల్ నుంచి కార్యకర్తలు, నాయకులు ప్రభంజనంలా తరలివస్తుండగా.. మండలంలోని పెద్దనాగారం స్టేజీ వద్ద వారికి ఈటల వారికి స్వాగతం పలికారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. పరకాల నియోజకవర్గం నుంచి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు అధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరారని చెప్పారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతుందని, పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని ధ్వజమెత్తారు. ఇటీవల బీఆర్‌ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో బీసీలకు, మహిళలకు అన్యాయం జరిగిందని, కేసీఆర్ మాయమాటలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చారని, ఈసారి గద్దె దింపడం ఖాయమన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారం చేపడుతుందన్నారు. అనంతరం ఖమ్మం సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెలే భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి జయంతిలాల్, హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ మురళీధర్, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు రవీందర్, సదానందం, శివకుమార్, రాజ్‌కుమార్, దివాకర్ పాల్గొన్నారు.