టెక్నోజియాన్– 24 షురూ..
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న మూడు రోజుల టెక్నోజియాన్– 24 వేడుకలను సీఎస్‌ఆర్–ఐఐసీటీ హైదరాబాద్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్వీ.చౌదరి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక విజ్ఞానం మెరుగైన సమాజ నిర్మాణానికి నూతన ఒరవడులను సృష్టించేందుకు తోడ్పడాలని అన్నారు. నిట్ వరంగల్‌లో ఇంజనీరింగ్ విద్యలో చోటు చేసుకుంటున్న మార్పులపై విద్యార్థులు పరస్పరం విజ్ఞానాన్ని పంచుకునే వేదికగా టెక్నోజియాన్–24 నిలవాలని సూచించారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ఇషాన్, బి.శ్రీనివాస్, డాక్టర్ మురళీధర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
టెక్నోజియాన్ పేరునే థీంగా..
నిట్ వరంగల్‌లో ప్రతి ఏడాది మూడు రోజులపాటు నిర్వహించే టెక్నోజియాన్ సాంకేతిక మహోత్సవానికి ప్రతి ఏడాది ఏదోఒక థీమ్‌తో నిర్వహించడం ఆనవాయితీ. కాగా.. టెక్నోజియాన్–24ను టెక్నోజియాన్ పేరునే థీమ్‌గా కొనసాగిస్తున్నట్లు టెక్నోజియాన్ టీం విద్యార్థులు తెలిపారు. టెక్నో అంటే టెక్నాలజీ అని.. జియాన్ అంటే వాగ్ధానం చేసిన భూమి అని దీనినే ప్రతి ఏడాది కొనసాగిస్తామని టెక్నోఫెస్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు. కాగా టెక్నోజియాన్–24 ప్రారంభోత్సవంలో భాగంగా విద్యార్ధులు అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియం ఎదురుగా శుక్రవారం టగ్ ఆఫ్ బాల్ పేరిట నువ్వా నేనా అంటూ సరదాగా పోటీ పడ్డారు.
నేడు టెక్నోజియాన్‌లో ఇలా...
ఈ ఏడాది 50 కిపైగా ఈవెంట్స్‌తో టెక్నోజియాన్–24 సందడి చేయనుంది. టెక్నోజియాన్–24 శనివారం రెండో రోజు మ్యాథమెటికల్ సొసైటీ ఆధ్వర్యంలో డేటా సైన్స్ క్వెస్ట్, ఫొటోగ్రఫీ క్లబ్ ఆధ్వర్యంలో రీక్రియేటింగ్ ది మూమెంట్, క్విజ్ క్లబ్ ఆధ్వర్యంలో కేబీసీ, మేనేజ్‌మెంట్ స్టడీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్యూచర్ మేనేజర్, మెకానికల్ సొసైటీ ఆధ్వర్యంలో వెహికిల్ షో, ఐడియాథాన్‌లతోపాటు మ్యాథ్స్ స్వ్కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ గజేంద్రపురోహిత్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ తనూజైన్ గెస్ట్ లెక్చర్స్‌తో కొనసాగనున్నాయి.
ప్రారంభించిన సీఎస్‌ఆర్ –ఐఐసీటీ సైంటిస్ట్ ఎన్వీ.చౌదరి
సమాజానికి సాంకేతిక విజ్ఞానం
తోడ్పడాలని పిలుపు
50కి పైగా ఈవెంట్స్
నేడు, రేపు కొనసాగనున్న టెక్నోఫెస్ట్
Comments
Please login to add a commentAdd a comment