ప్రజలకు భరోసా..
సాక్షి, మహబూబాబాద్: త్యాగాల ఫలితం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనకు అనుగుణంగా జిల్లాలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు భరోసా కల్పిస్తూ.. ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు.
విద్య, వైద్యం, వ్యవసాయం..
జిల్లా అభివృద్ధిలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. జిల్లాలోని 21ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 173సబ్‌సెంటర్లు, ఒక పట్టణ దవాఖాన, రెండు సీహెచ్‌సీలు, ఒక బస్తీ దవాఖానతో వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థుల సేవలు పేదలకు అందుతున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం, డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 134రకాల ఉచిత వైద్య పరీక్షలు అందిస్తున్నామని వివరించారు. అదేవిధంగా 1,216 పాఠశాలల్లో 1,00,180 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి ఉచిత పాఠ్య పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామని, ఇందుకోసం రూ. 12.42కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. డీఎస్సీ ద్వారా 364 మంది నూతన ఉపాధ్యాయులను నియమించి మెరుగైన బోధన అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతితోపాటు, పౌష్టికాహారం అందించేందుకు 40శాతం డైట్ చార్జీలు పెంచామని అన్నారు. జిల్లాలోని 63,737 మంది రైతులకు రూ. 564.34కోట్లతో రుణమాఫీ చేశామని, మరణించిన 445 మంది రైతుల కుటుంబాలకు రూ. 22.25కోట్లు రైతు బీమాను అందించామని వెల్లడించారు. పండ్ల తోటలు, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఆహార భద్రత పథకం ద్వారా ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరకు కొనేందుకు 238 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ. 1,55,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. మూడు మొబైల్ వెటర్నరీ క్లీనిక్‌లతో పశువుల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. చెరువులు, ఎస్సారెస్పీ జలాలను తరలిస్తూ వ్యవసాయానికి బాసటగా నిలిచామని చెప్పారు.
పేదల ముంగిట..
నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతో పేదల ముంగిటకు సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నామని చెప్పారు. గిరిజన సంక్షేమం ద్వారా 19 ఆశ్రమ పాఠశాలలు, 15 వసతి గృహాలు, 104 ప్రాథమిక పాఠశాలల్లో చదివే 8,266 మందికి విద్య, వసతి కల్పించి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్ ఓవర్సీస్ నిధి ద్వారా రూ. 12 మందికి రూ. 10లక్షల చొప్పున మంజూరు చేశామని అన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమంలో భాగంగా ప్రీమెట్రిక్ వసతి గృహాల నిర్వహణ, బీసీ, ఈబీసీ స్కాలర్‌షిప్స్ అందిస్తున్నామని చెప్పారు. కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు, మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా కుట్టు మిషన్లు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, మహిళా, శిశు, వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా భోజనం, పాలు, గుడ్లు అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మత్స్యశాఖ ద్వారా ఉచిత చేపపిల్లల పంపిణీ, నూతన చేపల చెరువుల నిర్మాణం కోసం సహకారం అందిస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా జిల్లాలో 2,440 మందికి రూ. 25.కోట్ల అందజేశామన్నారు. వీటితోపాటు ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు అమలు చేశామని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల అధికారుల సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నామని, ఇదే సహకారంతో మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, జిల్లా ప్రముఖులు పాల్గొన్నారు.
జవాబుదారీతనం, పారదర్శక పాలన
పేదల ముంగిటకు సంక్షేమ పథకాలు
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్
స్టేడియంలో గణతంత్ర వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment