స్పెషల్ పాలన
మహబూబాబాద్: మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదివారం మున్సిపాలిటీల పాలకమండలి పదవీకాలం ముగియడంతో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు జిల్లాలోని మానుకోట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల స్పెషలాఫీసర్‌గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగి, నూతన పాలకవర్గం కొలువుదీరే వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.
ఐదు మున్సిపాలిటీలు..
జిల్లాలో మానుకోట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగా కేసముద్రం మేజర్ గ్రామ పంచాయతీని ఇటీవల మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయగా వాటి సంఖ్య ఐదుకు చేరింది. నాలుగు మున్సిపాలిటీల పాలకమండలి పదవీకాలం ఈనెల 26తో ముగిసింది. వెంటనే స్పెషల్ ఆఫీసర్ల నియామకం చేస్తూ ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాలనపరమైన ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకుంది.
అంచనాలు తారుమారు..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోను నియమించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందరి అంచనాలు తీరుమారు అయ్యాయి. గతంలో ఆర్డీఓలను స్పెషల్ ఆఫీసర్‌లుగా నియమించారు. అధికారుల అంచనాలను తారుమారు చేస్తూ అదనపు కలెక్టర్‌కు అవకాశం ఇచ్చారు. కాగా కేసముద్రం మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంది. ఆ మున్సిపాలిటీకి కూడా త్వరలోనే నియమిస్తారని అధికారులు తెలిపారు.
జీపీల్లో కొనసాగుతున్న
స్పెషల్ ఆఫీసర్ల పాలన..
గ్రామాల్లో ఏడాదిక్రితం సర్పంచ్‌ల పదవీకాలం ముగియగా.. జీపీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. గెజిట్ ఆఫీసర్ల(పాఠశాలల హెచ్‌ఎంలు, జేఎల్‌లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు)కు ఆ బాధ్యతలు అప్పగించారు. సర్పంచ్‌లకు ఉన్న అధికారాలన్నీ వారికి ఇవ్వడంతో పాలన సాగుతోంది. మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరిగి పాలకమండలి ఏర్పాటయ్యే వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది.
ముగిసిన మున్సిపాలిటీల పాలకమండలి గడువు
స్పెషల్ ఆఫీసర్ల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
జిల్లాలో ఐదు పురపాలికలు
నాలుగు మున్సిపాలిటీల స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment