నెరవేరనున్న 40 ఏళ్ల కల..!
కాజీపేట రూరల్ : పట్టణ ప్రజల చిరకాల కోరిక కాజీపేట బస్టాండ్ కల త్వరలో నెరవేరబోతుంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కృషి, పట్టుదలతో 40 ఏళ్ల బస్టాండ్ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. కాజీపేట బస్టాండ్, కాజీపేట రైల్వే డివిజన్, బోడగుట్ట ఫుట్ఓవర్ బ్రిడ్జి, కాజీపేట స్టేషన్ సమీపాన రోడ్డు అండర్‌బ్రిడ్జి, ఇతర దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్‌నాథ్ కోట్లను వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దీనిపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. బస్టాండ్ కోసం ఎకరం భూమిని లీజ్ లేదా, రైల్వే భూమి ఇస్తే ప్రభుత్వ భూమి ఇవ్వడం, లేదంటే ప్రభుత్వ ధర ప్రకారం భూమి ఇవ్వాలని జీఎంను కోరామన్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా అధికారులు, రైల్వే అధికారుల బృందం కాజీపేట జంక్షన్లో రైల్వే సంఘ్ కార్యాలయం సమీపం నుంచి బ్రిడ్జి వైపు రైల్వే క్వార్టర్స్స్థలాన్ని జాయింట్ ఇన్స్పెక్షన్ విజిట్ చేయనున్నట్లు తెలిపారు. ఫాతిమా బ్రిడ్జి నిర్మాణం ఏప్రిల్‌లో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. కాజీపేట బస్టాండ్ ల్యాండ్ ఫైనల్ కావడంతో పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఫాతిమా బ్రిడ్జి ప్రారంభం, కాజీపేట బస్టాండ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జరిపిస్తామన్నారు. అలాగే, కాజీపేట చిరకాల వాంఛ కాజీపేట డిగ్రీ కాలేజీ, కాజీపేట ప్రభుత్వ ఆసుపత్రి మంజూరును ముఖ్యమంత్రితో అనౌన్స్మెంట్ చేయించాలన్నదే తన కల అని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తెలిపారు.
కాజీపేట బస్టాండ్ నిర్మాణానికి
అడుగులు
నేడు కలెక్టర్, ఆర్డీఓ, రైల్వే అధికారుల బృందం జాయింట్ ఇన్స్పెక్షన్ విజిట్
Comments
Please login to add a commentAdd a comment