మహబూబ్‌నగర్: అడవి జంతువులను ఏ రకంగా చంపినా అటవీ శాఖ కొత్త చట్టం ప్రకారం పట్టుబడితే కేసుతో పాటు రూ. 1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు అటవీశాఖ వారు పేర్కొన్నారు. ఇటీవల మండల పరిధిలోని అంబట్‌పల్లికి చెందిన వ్యక్తి అడవి పందిని చంపడంతో అటవీశాఖ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని అతనితో రూ.లక్ష జరిమానా వసూలు చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది.
పెద్దకొత్తపల్లి మండలం ఆదిరాల దగ్గర రైతు పంట పొలాన్ని రక్షించుకోవడానికి పొలం చుట్టూ విద్యుత్ తీగలతో షాక్‌ను ఏర్పాటు చేశాడు. తీగలకు తగిలిన పంది చనిపోయింది. దాన్ని అంబట్‌పల్లికి చెందిన వ్యక్తి కొనుగోలు చేసి తీసుకొస్తున్న క్రమంలో అటవీశాఖ స్పెషల్ పార్టీ వారు పట్టుకున్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రూ.లక్ష జరిమానా వసూల్ చేశారు. ఈ విషయాన్ని అటవీ శాఖకు చెందిన ఓ అధికారి ధృవీకరించారు.
ప్రస్తుతం పంట సాగు సీజన్ కావడంతో పొలాల రైతులు అడవిపందుల నుంచి పంటలను రక్షించుకోవడానికి విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొందరు వేటగాళ్లు వేటనే తమ వృత్తిగా ఎంచుకొని కొనసాగిస్తుంటారు. అటవీ శాఖ కొత్తగా రూపొందించిన చట్టం కఠినంగా ఉండడంతో రైతులు, వేటగాళ్లు అడవి జంతువులను చంపే ప్రయత్నాలు మానుకోవాలి. లేదంటే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment