TS Mahabubnagar Assembly Constituency: TS Election 2023: ‘కారు’లో కిరికిరి.. ‘అలంపూర్‌’లో అలజడి!
Sakshi News home page

TS Election 2023: ‘కారు’లో కిరికిరి.. ‘అలంపూర్‌’లో అలజడి!

Published Sat, Oct 14 2023 12:46 AM | Last Updated on Sat, Oct 14 2023 9:37 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు.. మరో ముఖ్యనేత అసమ్మతి రాగం వెరసి ‘కారు’లో కీచులాటలు తారస్థాయికి చేరాయి. శుక్రవారం ప్రగతిభవన్‌కు చేరిన అలంపూర్‌ పంచాయితీయే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్‌ ఇవ్వొద్దని.. అభ్యర్థిని మార్చాలని వందలాది వాహనాల్లో తరలివెళ్లిన పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిసి ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. మరోవైపు గులాబీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, ఢిల్లీలో అధికార ప్రతినిధి మందా జగన్నాథం సైతం పార్టీ అభ్యర్థిని మార్చాలని.. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని బహిరంగంగానే విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారగా.. పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.

‘చల్లా’రుతాయా.. లేక..
ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగా.. వచ్చే నెల మూడో తేదీన ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది. త్వరలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాం ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అలంపూర్‌లో చల్లారినట్లే చల్లారిన అసమ్మతి సెగలు మళ్లీ భగ్గుమనడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి నేతలు భేటీకి అలంపూర్‌ను ఎంచుకున్నప్పటికీ.. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లికి మార్చారు.

ఎమ్మెల్సీ చల్లా సూచనతోనే సమావేశ వేదికను మార్చినట్లు సమాచారం. సమావేశం అనంతరం అసమ్మతి నేతలు హైదరాబాద్‌కు వెళ్లి అలంపూర్‌ అభ్యర్థిని మార్చాలని ఏకవాక్య తీర్మానంతో వినతిపత్రం సమర్పించిన క్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ ‘మీరు ఏదైతే వినతిపత్రం ఇచ్చారో యథాతథంగా సీఎం కేసీఆర్‌కు అందజేస్తాను. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీ మనోభావాలను మీరు స్పష్టంగా చెప్పారు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను.. వారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు.’అని వెల్లడించడంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థిని మార్చని పక్షంలో చల్లా నిర్ణయం ఏవిధంగా ఉంటుందోననే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

అప్పటి నుంచి పెరిగిన గ్యాప్‌..
అలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు చల్లా వెంకట్రామిరెడ్డిని పార్టీలో చేర్చుకుని.. ఆ వెంటనే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జోగుళాంబ ఆలయ చైర్మన్‌, తదితర పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, ఆయన మధ్య గ్యాప్‌ బాగా పెరిగింది.

ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకోగా.. ఎమ్మెల్యే అబ్రహానికి కాకుండా ఇతరులకు పార్టీ టికెట్‌ ఇప్పించేందుకు చల్లా ప్రయత్నించినట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్‌ జాబితా ప్రకటించగా.. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాయకులు అబ్రహానికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. వీటి వెనుక ఎమ్మెల్సీ చల్లా హస్తం ఉందని ఎమ్మెల్యే సైతం పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement