ట్రాక్టర్ కింద పడి యువకుడి దుర్మరణం
ఉండవెల్లి: మండలంలోని జోగుళాంబ రైల్వే స్టేషన్ సమీప మార్గంలో అభిషేక్(20) అనే యువకుడు ట్రాక్టర్ కిందపడి దుర్మరణం చెందినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. వివరాలు.. కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామానికి చెందిన అభిషేక్ ట్రాక్టర్ మీద డ్రైవర్ కమతం రాజుతో కలిసి ఉండవెల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో కుక్క అడ్డురావడంతో ట్రాక్టర్ సడెన్ బ్రేక్ వేశాడు. అభిషేక్ టైరు కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. గమనిచిన స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా కమతం రాజు వాళ్ల అన్న కమతం దేవదానం కుమారుడు అభిషేక్. కుమారుడి మృతి చెందడంతో తమ్ముడు రాజుపై దేవదానం ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
మనస్తాపంతో
యువకుడి బలవన్మరణం
ఊట్కూర్: మండలంలోని పెద్దజట్రం గ్రామంలో కొత్తిలి రవికుమార్ (25) అనే యువకుడు శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్లెపల్లి గ్రామానికి చెందిన నారాయణ కూతురు లక్ష్మితో రవికుమార్‌కు రెండేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. కాగా ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో ఒక చేయి తీసివేశారు. సుమారు రూ. 10లక్షల వరకు ఖర్చుఅయింది. భార్య సంక్రాంతి పండుగకు వెళ్లి రాలేదు. డబ్బుల విషయమై సోదరులతో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపం చెందిన రవి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతి చెందిన విషయమై రెండు రోజులుగా ఇరు కుంటుంబసభ్యులు, గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయతీలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై ఎస్ఐ కృష్ణంరాజుకు వివరణ కోరగా స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించాచామన్నారు. ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ..
పాన్‌గల్: చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోప్లాపూర్‌కి చెందిన శేఖర్(20) ఈనెల 16న వనపర్తి మండలం మెట్పల్లి దగ్గర రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో గాయపడ్డాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో పది రోజుల నుంచి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కుమారుడు అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment