![అచ్చం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/28/27acpt103-210107_mr-1738006254-0.jpg.webp?itok=WBJLXMq8)
అచ్చంపేటలో వేరుశనగ రైతుల ఆందోళన
అచ్చంపేట రూరల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కేటాయించకుండా.. తమకు మద్దతుగా ఉండాల్సిందిపోయి ట్రేడర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ రైతులు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి, చైర్‌పర్సన్ భర్తపై దాడికి దిగారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం భారీ ఎత్తున వేరుశనగ పంట తీసుకొచ్చారు. అయితే గరిష్ట ధర రూ.6,600, కనిష్ట ధర రూ.5,010గా మార్కెట్ అధికారులు ప్రకటించారు. తక్కువ ధర పలకడంతో రైతాంగం ఒక్కసారిగా కోపోద్రిక్తులై వ్యవసాయ మార్కెట్‌లోని కార్యాలయం వద్దకు వెళ్లి.. మార్కెట్ కార్యదర్శి నర్సింహులుతో వాగ్వాదానికి దిగారు. కార్యాలయంలోనే ఉన్న చైర్‌పర్సన్ రజిత భర్త మల్లేష్ కల్పించుకుని మాట్లాడారు. దీంతో రైతుల పక్షాన ఉండాల్సిన ట్రేడర్లతో కుమ్మక్కవుతారా..? అంటూ ఇద్దరిపై దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మహిళా రైతులు శాపనార్థాలు, తిట్ల పురాణం అందుకున్నారు. అక్కడున్న కొందరు రైతులే దాడిని సైతం అడ్డుకుని మార్కెట్ కార్యదర్శిని కాపాడి, కార్యాలయం గదిలోకి పంపించారు. అయితే గతేడాది ఫిబ్రవరిలో అప్పట్లో ఉన్న చైర్‌పర్సన్ అరుణపై కూడా దాడి యత్నం జరిగిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడిన రైతులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు.
మార్కెట్ కార్యదర్శి, చైర్‌పర్సన్ భర్తపై దాడి
![అచ్చంపేటలో వేరుశనగ రైతుల ఆందోళన 1](https://www.sakshi.com/gallery_images/2025/01/28/27acpt104-210107_mr-1738006254-1.jpg)
అచ్చంపేటలో వేరుశనగ రైతుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment