ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈ ఆర్థిక సంవత్సరం (2024–25) ముగియడానికి కేవలం రెండు నెలల సమయమే ఉన్నందున ఆస్తిపన్ను, దుకాణాల అద్దె, నల్లా బిల్లుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని సుమారు 50 వేల పైచిలుకు ఇళ్లు, ఇతర భవన సముదాయల నుంచి పాత బకాయిలతో కలుపుకొని మొత్తం రూ.49.56 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం రూ.13.07 కోట్లు మాత్రమే వసూలైందన్నారు. గడువులోగా కనీసం మరో రూ.పది కోట్లయినా రాబడితేనే 16వ ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు అర్హత దక్కుతుందన్నారు. ఆ దిశగా అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. దీనికోసం ఇప్పుడున్న నలుగురు ఆర్‌ఐలతో పాటు మరో ఇద్దరు, అలాగే 34 మంది వార్డు ఆఫీసర్లు కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరికి వారు తమకు కేటాయించిన వార్డులలో ఇంటింటికీ తిరిగి ఆస్తిపన్ను, నల్లాబిల్లులు రాబట్టాలన్నారు. ఇక పట్టణంలోని క్లాక్‌టవర్, మార్కెట్ ఏరియా, న్యూటౌన్, టీడీగుట్ట ప్రాంతాల్లోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ల నుంచి అద్దె బ కాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయన్నారు. సదరు దుకాణ యజమానులకు వెంటనే నోటీసులు అందజేసి వీలైనంత త్వరగా అద్దెలు రాబట్టాలన్నారు. ఎవరైనా స్పందించకుంటే వెంటనే ఆ దుకాణాలను సీజ్ చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా, ఆర్‌ఐలు రమేష్, ముజీబుద్దీన్, పెంటయ్య, అహ్మద్‌షరీఫ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
దుకాణాల అద్దె, నల్లా బిల్లులూ రాబట్టాలి
మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment