దర్జాగా తవ్వేస్తున్నారు!
జడ్చర్ల పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుట్టలు, కొండలు ఉన్నాయి. వీటిని తవ్వి, బ్లాస్టింగ్ చేసి బండరాళ్లను యథేచ్ఛగా ఇతర ప్రాంతాల తరలిస్తున్నారు. మట్టిని సైతం టిప్పర్ల ద్వారా రేయింబవళ్లు రవాణా చేస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. తమ పట్టా భూముల్లో ఉన్నాయంటూ అక్రమార్కులు బుకాయిస్తున్నారు. కొందరేమో ప్రభుత్వ భూముల్లో ఉన్న గుట్టలు తమవే అంటూ దర్జాగా తవ్వకాలు చేస్తున్నారు. జడ్చర్ల హౌసింగ్ బోర్డు వెనుకాల సర్వే నంబర్ 297లోని ప్రభుత్వ భూమిలో గల ఓ భారీ గుట్టను ఆరు మాసాలుగా బ్లాస్టింగ్ చేస్తూ నేలమట్టం చేస్తున్నారు. ఇదే తరహాలో హౌసింగ్‌బోర్డును ఆనుకుని ఉన్న కోశ గుట్టను సైతం తవ్వేశారు. కొన్ని రోజుల్లో ఇక్కడ గుట్టలు ఉన్నాయన్న ఆనవాళ్లు కూడా కనిపించవు. ఇప్పటికే శంకరాయపల్లి శివారులో ఉన్న బొంగరాళ్ల గుట్ట కర్పూరంలా కరిగిపోయిన పరిస్థితి. ఇదే తండా శివారులో మరో గుట్టను సైతం తవ్వేస్తున్నారు. ఎర్రగుట్ట, బూరెడ్డిపల్లి శివారులోని గుట్టల ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి.
ప్రమాదం అంచున భగీరథ ట్యాంకు..
మట్టి తవ్వకాలు చేస్తుండడంతో భారీ సామర్థ్యంతో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుకు ప్రమాదం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హౌసింగ్ బోర్డు సమీపంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన ట్యాంకు చుట్టూ అక్రమార్కులు మట్టిని తవ్వుతుండడంతో ట్యాంకు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి.
● గుట్టలు, కొండలు, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కళ్ల ఎదుటే భారీ హిటాచీలు, టిప్పర్లతో గుట్టలను ధ్వంసం చేస్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారే గానీ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోతుందన్నారు.
జడ్చర్ల పరిసర ప్రాంతాల్లోనేలమట్టం అవుతున్న గుట్టలు
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
యథేచ్ఛగా బండరాళ్లు, మట్టి తరలింపు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్‌శాఖ యంత్రాంగం
విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. శతాబ్దాలుగా ఉన్న గుట్టలు, కొండలు అక్రమార్కుల చేతుల్లో పడి శల్యం అవుతున్నాయి. భవిష్యత్ తరాలకు ఇక్కడ గుట్టలు ఉన్నాయన్న విషయాన్ని నమ్మలేనంతగా ఆనవాళ్లను సైతం అదృశ్యం చేస్తున్నారు. భారీ సామర్థ్యం గల హిటాచీ, పొక్లెయిన్లు.. ఇతర యంత్ర సామగ్రి సాయంతో సహజ సిద్ధ కొండలను దర్జాగా తవ్వేస్తున్నారు. టిప్పర్లలో ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా మట్టిని, బండరాళ్లను తరలిస్తున్నారు. మైనింగ్ మాఫియా రెచ్చిపోతుండడంతో ప్రభుత్వ, పట్టాభూముల్లో ఉన్న గుట్టలు నేలమట్టం అవుతున్నాయి. తవ్వకాలనుఅరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్‌శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు. స్థానికులు అధికారులకు పదేపదే ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
– జడ్చర్ల
Comments
Please login to add a commentAdd a comment