రిజర్వేషన్లు తీసివేతకు బీజేపీ కుట్ర | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు తీసివేతకు బీజేపీ కుట్ర

Published Wed, May 8 2024 11:50 PM

రిజర్వేషన్లు తీసివేతకు బీజేపీ కుట్ర

● రాహుల్‌ను ప్రధానిని చేస్తేనే మేలు ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ● నిర్మల్‌లో పార్టీ నేతలతో సమావేశం

నిర్మల్‌చైన్‌గేట్‌: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తీసివేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశానికి పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతో ప్రధాని మోదీ దేశంలో మత వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడి దేశంలో లౌకికవాదాన్ని నిలబెట్టాలని ప్రజల కోసం పోరాడుతున్న రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలంటే ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తున్న మోదీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటేనని, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని తెలిపారు. రైతు భరోసా విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేలా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఓబీసీ కులగణన ద్వారా దేశ సంపద, రాజ్యాధికారంలో జనాభా దామాషా ప్రకారం వాటా లభిస్తుందని రాహుల్‌గాంధీ బీజేపీ పాలకులకు పలుసార్లు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగణన ప్రారంభించామని, కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలోనూ చేపడతామని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం హక్కులు, సంపద కల్పిస్తామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగు నీరు ఇవ్వకుండా ఆదిలాబాద్‌ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల తర్వాత ప్రాణహితను నిర్మించి ఉమ్మడి జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. జిల్లాలో భూములపై ఆదివాసీ గిరిజనులకు ఉన్న హక్కులను ధరణి ద్వారా గత పాలకులు ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ట్రైబల్‌, నాన్‌ ట్రైబల్‌ ప్రజల భూసమస్యలు పరిగణనలోకి తీసుకుని వారికి త్వరలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏలకు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు. అకాల వర్షం, గాలి దుమారానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, నష్టం అంచనాకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుంటే అమాయక గిరిజన, ఆదివాసీ ప్రజల గళాన్ని పార్లమెంట్‌లో వినిపించి వారి హక్కుల సాధనకు పోరాటం చేస్తారని తెలిపారు. మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement