రెండు రోజుల్లో 64 గొర్రెలు మృతి
● మరో 10 జీవాల పరిస్థితి విషమం ● వడ్లగింజలు తిని మృతి చెందినట్లు ధ్రువీకరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మేతకు వెళ్లిన గొర్రెలు తెలియకుండా తిన్న ఆహారంతో రెండు రోజుల్లో 64 మృతి చెందాయి. సంఘటనా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం నంనూర్‌కు చెందిన కాపరులు శనివారం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాలకు గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఆదివారం మేతకు వెళ్లగా మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా రాత్రి వరకు 30 గొర్రెలు మృతి చెందాయి. ఆదివారం రాత్రి నుంచి పశువైద్యాధికారిణి శాంతిరేఖ ఆధ్వర్యంలో చికిత్స అందించినా సోమవారం ఉదయం వరకు మరో 34 గొర్రెలు మృతి చెందగా 10 జీవాల పరిస్థితి విషమంగానే ఉంది. నంనూర్‌కు చెందిన గోపు రాజ్‌కుమార్ 17 గొర్రెలు, గోపు కొమురయ్య చెందిన 16, గోపు మల్లేశ్‌కు చెందిన 16, గోపు రమేశ్‌కు చెందిన 15 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యాధికారి శాంతిరేఖ అధికమొత్తంలో వడ్ల గింజలు తిని మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అవయవాలను ఆదిలాబాద్‌లోని పశు వ్యాధుల డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కు పంపించినట్లు ఆమె పేర్కొన్నారు. గొర్రెల విలువ రూ.6 లక్షలకు పైగా ఉంటుందని, ప్రభుత్వం పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.
స్పందించిన కలెక్టర్.. ఎమ్మెల్యే..
కలెక్టర్ కుమార్‌దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఆర్థిక చేయూతకు ముందుకు వచ్చారు. ఒక్కో గొర్రెకు కలెక్టర్ తన ఫండ్ నుంచి రూ.2 వేలు, ఎమ్మెల్యే వ్యక్తిగతంగా రూ. వెయ్యి కలిపి మొత్తంగా రూ.3 వేల చొప్పున పరిహారంగా అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment