సాక్షి, మెదక్: శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నా ఆయా రాజకీయ పార్టీల్లో నేతల వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఆయా పార్టీల నుంచి ఇతర పార్టీలకు నేతల వలసలు జోరుగా సాగుతున్నాయి. పార్టీలు మారిన నేతలతో ఓటర్లుకూడా మారుతారా? అనేది సందేహం.
జంప్‌జిలానీల బలమెంత?
అయితే ఈ నేపథ్యంలో జంప్‌జిలానీల బలమెంత? వాళ్లకున్న ఓటు శాతం ఎంత? అనే ప్రశ్నలు అభ్యర్థులను వెంటాడుతున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్‌కన్నా ముందే సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయించారు. దీంతో బీఆర్‌ఎస్‌లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు కాంగ్రెస్‌లోచేరి టికెట్టు తెచ్చుకోగా కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు సైతం బీఆర్‌ఎస్‌లోకి వలసలు వెళ్లారు. అలాగే అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలు కాంగ్రెస్‌లో చేరారు.
అలాంటి పరిస్థితుల్లో అసలు పార్టీ మారిన వారితోపాటు ఓటర్లు బదిలీ ఏ మేరకు జరుగుతుందన్నది ఇప్పుడు అధినేతల ముందు ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీలకు జంప్ జిలానీల సంఖ్య అధికసంఖ్యలో పెరిగింది. ఆయా పార్టీల్లో నేతలపై వ్యతిరేకతతో కొందరు, టికెట్ ఆశించి రాకపోవడంతో మరికొందరు ఆయా పార్టీల కండువాలు మార్చేశారు. అయితే, వలస పోతున్న నేతల వెంట ఓటు బదిలీ జరిగేనా అన్న సందిగ్ధత ఆయా పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది.
మెదక్‌లో..
మెదక్‌లో బీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌కు రాజీనామాచేసి కాంగ్రెస్ నుంచి తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావుకు, మల్కాజ్‌గిరి నుంచి ఆయన టికెట్లు తెచ్చుకున్నారు. దీంతో మెదక్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, మ్యాడం బాలకృష్ణ ఒకరి తరువాత ఒకరు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా బీఆర్‌ఎస్‌లో తమకు ప్రధాన్యత దక్కడం లేదని ద్వితీయ శ్రేణినాయకులు కాంగ్రెస్‌లో చేరారు. పంజావిజయ్ కుమార్ సైతం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో విబేధించి ఆయన బీజేపీలోచేరి టికెట్ తెచ్చుకున్నారు.
నర్సాపూర్‌లో..
నర్సాపూర్‌లో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కాకుండా సునితాలక్ష్మారెడ్డికి టికెట్ దక్కింది. దీంతో మదన్‌రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ బుజ్జగించడంతో మదన్‌రెడ్డి సునితారెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ టికెట్ రాజిరెడ్డికి దక్కడంతో ఆ టికెట్‌ను ఆశించి భంగపడిన గాలిఅనిల్ వెంటనే అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు.
దీంతో నర్సాపూర్ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నాయకులైన వెల్దూర్తి ఎంపీపీ స్వరూప నరేందర్‌రెడ్డి, చిలిపిచెడ్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఆయన తల్లి సుహాసిని రెడ్డి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం విధితమే.. వారితోపాటు ఆ నేతల వెంట కింది స్థాయి నాయకులు కూడా కండువాలు మార్చారు.
దొరకని ఓటరు నాడి..
ఒకపార్టీ నుంచి మరో పార్టీమారిన నాయకుడి బలం ప్రజల్లో ఏమేరకు ఉంది. ఆ నేత చెబితే ఓట్లు పడతాయా? కండువా మార్చిన నాయకుడికి తన గ్రామం, మండలం, పట్టణం, జిల్లాలో ఏమేరకు పేరుంది? అన్న అనుమానాలు అభ్యర్థుల్లో నెల కొన్నాయి. స్థానిక నేతలు తమ వైపు రావడంతో ఆయా ప్రాంతాల్లో అప్పటి వరకు వారిని నమ్మిన ఓటర్లు ఇప్పుడు వారు మారిన పార్టీకి వేస్తారా? లేదా? అన్న ఆందోళన పలువురు అభ్యర్థుల్లో కనబడుతోంది.
ప్రస్తుతం జిల్లాలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనాలు తండోపతండాలుగా సభలకు వెళుత్తున్నారు. ఈ పరిస్థితులలో ఓటర్ల నాడి తెలియని పరిస్థితి. ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ వలస నేతలతో ఓటరు మనవైపు వస్తాడా.. అని అభ్యర్థులు మథనపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment