అర్హులకు సంక్షేమ ఫలాలు: జెడ్పీ సీఈఓ
తూప్రాన్: నాలుగు సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందజేస్తామని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. ఆదివారం మండలంలోని ఇమాంపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులకు వివిధ పథకాలకు సంబంధించిన పత్రాలు అందజేశారు. పథకాలు అందనివారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, అర్హులను గుర్తించి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషాద్రి, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీఓ సతీష్, డీటీ శ్రీకాంత్, ప్రభుదాస్, ఏఈపీఆర్ మధు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
అధికారులను బెదిరిస్తే సహించేది లేదు
వెల్దుర్తి(తూప్రాన్): నియోజకవర్గంలోని అధికారుల పట్ల ఎమ్మెల్యే సునీతారెడ్డి దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. ప్రజాపాలనలో భాగంగా ఆదివారం ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభించి నందుకు వెల్దుర్తిలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ధనం కేసీఆర్ కుటుంబం దోచుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి వినియోగిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్, నర్సింహారెడ్డి, శంకరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే
ప్రభుత్వ ధ్యేయం
రేగోడ్(మెదక్): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని పీసీసీ సభ్యుడు కిషన్ అన్నారు. మండలంలోని గజ్వాడలో ఆదివారం నాలుగు పథకాలను అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో జిల్లాలోనే అత్యధికంగా గ్రామానికి 272 ఇందిరమ్మ గృహాలు మంజూరు అయ్యాయని చెప్పారు. త్వరలోనే రూ. రెండు లక్షలకు పైగా ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మల్లేశం, తహసీల్దార్ నరేశ్, ఎంపీడీఓ సీతారావమ్మ, ఏఓ జావిద్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలకు
ప్రత్యేకాధికారి
మెదక్‌జోన్: జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ (ఏసీఎల్‌బీ)ను నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారి నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment