![తిప్పి కొట్టేందుకు సిద్ధం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/29/28nrs02-350088_mr-1738117872-0.jpg.webp?itok=3qcJ-nHI)
తిప్పి కొట్టేందుకు సిద్ధం
కాంగ్రెస్ నియోజకవర్గ
ఇన్‌చార్జి
ఆవుల రాజిరెడ్డి
నర్సాపూర్ : ప్రజా పాలన కార్యక్రమాల్లో వ్యతిరేక చర్యలకు పాల్పడితే వాటిని తిప్పి కొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి నియోజకవర్గంలో ప్రజా పాలన కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడితే ఆమె చర్యలను తిప్పికొట్టేందుకు తమ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డికి పదవీ వ్యామోహం ఎక్కువని, బడుగు బలహీన వర్గాల ప్రజలంటే ఆమెకు నచ్చదని, వారి ఓట్లు మాత్రం కావాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ విమర్శించారు. ఇటీవల జరిగిన వెంకటాపూర్ ప్రజాపాలన సభలో తోటి మహిళా ప్రజా ప్రతినిధి సుహాసినిరెడ్డి పట్ల ఎమ్మెల్యే సునీతారెడ్డి వ్యవహార తీరు సరిగా లేదని ఆక్షేపించారు. తోటి మహిళనని చూడకుండా తన చేతిలో నుంచి మైకు లాక్కోవడం ఎంత వరకు సమంజసమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు రిజ్వాన్, మల్లేశ్, మహేశ్‌రెడ్డి, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ గుప్తా, లలిత, అశోక్, చిన్న ఆంజిగౌడ్, రషీద్, నవీన్ గుప్తా, మణిదీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment