ఉపాధి సిబ్బంది పోరుబాట
● 14 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన ● మూడు నెలలుగా అందని వేతనాలు ● జిల్లావ్యాప్తంగా 395 మంది ఉద్యోగులు
మెదక్‌జోన్: సమస్యల పరిష్కారం కోసం ఉపాధి సిబ్బంది పోరుబాట పట్టారు. 14 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనకు కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా బుధవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో సమ్మెకు వెళ్లక తప్పదని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.
టెక్నికల్ సిబ్బందికి రెగ్యులర్ వేతనాలు
జిల్లావ్యాప్తంగా 395 మంది (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 80 మంది టెక్నికల్ సిబ్బందికి మాత్రమే రెగ్యులర్‌గా వేతనాలు వస్తుండగా, మిగితా 315 మందికి మాత్రం మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా 1.64 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 3.31 లక్షల మంది కూలీలు ఉన్నారు. నిత్యం 40 వేల నుంచి 50 వేల వరకు కూలీలు పనులు చేస్తున్నారు. వీరితో ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో అనేక రకాల పనులు కల్పిస్తున్నారు. వ్యవసాయ అనుసంధాన పనులతో పాటు మొక్కల పెంపకం, హరితహారం, మట్టిరోడ్లు, పాఠశాలల్లో ప్రహరీ, కిచెన్‌షెడ్ల నిర్మాణాలు, నర్సరీల పెంపకం.. ఇలా అనేక రకాల పనులు కూలీలతో చేయిస్తూ వలసల నివారణకు నిరంతరం కృషి చేస్తున్నారు. అయితే మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు.
ప్రతీనెల వేతనాలివ్వాలి
ఉపాధి సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతీనెల వేతనాలు ఇవ్వాలి. గతేడాది సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధి సిబ్బందికి పేస్కేల్ అమలు చేస్తామని చెప్పారు. కానీ నేటికీ అమలు చేయలేదు. ఇప్పటికై నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.. లేనిచో సమ్మెబాట పట్టకతప్పదు.
– రాజ్‌కుమార్, జేఏసీ చైర్మన్, మెదక్
Comments
Please login to add a commentAdd a comment