‘‘నేను నటుడిగా కాకుండా ఓ ప్రేక్షకుడిగా కథలు వింటాను. సుకుమార్‌గారు ‘రంగస్థలం’లో నా పాత్ర (కుమార్ బాబు) గురించి చెప్పిన వెంటనే చేస్తానని చెప్పేశా. అలాగే పృథ్వీ ఆదిత్యగారు ‘క్లాప్’ కథ చెప్పగానే ఓకే చెప్పాను. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది’’ అని ఆది పినిశెట్టి అన్నారు. పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్లాప్’.
బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐ.బి. కార్తికేయన్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీ సాయి మూవీస్ పతాకాలపై రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘క్లాప్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా నేడు ‘సోనీలివ్’ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘క్లాప్’ టీజర్, ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో కామెడీ, డాన్స్, ఫైట్స్ వంటి కమర్షియల్ అంశాలుండవు. కానీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి.
నేను, ఆకాంక్ష స్పోర్ట్స్ పర్సన్స్‌గా నటించాం. మా ఇద్దరి జర్నీ మరొకరి భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దిందనేది ప్రధాన అంశం ఇళయరాజాగారి సంగీతం, రీ రికార్డింగ్ సినిమాకు బలం’’ అన్నారు. ‘‘ఈ కథలోని నిజాయితీ, ఆదిగారివల్లే ఈ సినిమా తీశాను’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. ‘‘ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ కరోనా వల్ల సోనీలివ్‌తో కమిట్ అయి, రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు రామాంజనేయులు.
Comments
Please login to add a commentAdd a comment