
ముంబైలో బాలీవుడ్ నటితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ క్యాబ్ డ్రైవర్. ఇంటికి వెళ్లేందుకు శనివారం రాత్రి 8.15 గంటలకు నటి మానవ నాయక్ క్యాబ్ బుక్ చేసుకుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో క్యాబ్ ఎక్కిన నటి క్యాబ్ డ్రైవర్‌ను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని వారించింది. అయినా వినకుండా అలాగే ముందుకెళ్లాడు. అతన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించారు.
ఆ తర్వాత కారును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లమని నటి చెప్పడంతో వినకుండా మరింత వేగంతో ముందుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక చీకటి ప్రదేశంలో కారు నిలిపాడు. దీంతో ఆమె ఆందోళనకు గురైంది. ఐదు వందల ఫైన్ మీరు కడతారా అంటూ నటిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు క్యాబ్ డ్రైవర్. అంతే కాకుండా ఆమెను దూషించాడు. వెంటనే గ్రహించిన నటి గట్టిగా అరవడంతో రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనదారులు, ఆటోవాలా ఆమెను రక్షించారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సురక్షితంగా బయటపడినా తీవ్రమైన భయాందోళనకు గురైనట్లు మానవ నాయక్ తెలిపింది. మానవ నాయక్ హిందీతో పాటు పలు మరాఠీ చిత్రాల్లో నటించింది.
— Manava Arun Naik (@Manavanaik) October 15, 2022
ఈ విషయంపై ముంబై జాయింట్ సీపీ స్పందించారు. నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు తీవ్రంగా పరిగణిస్తామని వెల్లడించారు. డీసీపీ స్థాయిలో దీనిపై విచారణ చేపడతామని ఆమె పోస్ట్‌కు ఆయన బదులిచ్చారు. ఈ ఘటనలో క్యాబ్ సంస్థను వివరణ కోరుతున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు.