తెలుగుదేశం అధినేత, మాజీసీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ. 371 కోట్లను మళ్లించినట్లు ఏపీ సీఐడీ దర్యాప్తులో తేలింది. ఆ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించింది. పక్కా ప్లానింగ్‌తోనే నిధులు మళ్లించినట్లు తేలిందని ఏపీ సీఐడీ వెల్లడించింది. స్కిల్ స్కాంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని, ఆయన కనుసన్నల్లోనే స్కాం జరిగిందని తెలిపింది. ఆనాటి ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందని ఏపీ సీఐడీ పేర్కొంది. కాగా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
అయితే చంద్రబాబు కేసు నేపథ్యంలో ఆయన గతంలో సీనియర్ ఎన్టీఆర్‌కు మోసం చేసిన సంఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నిజస్వరూపం గురించి గతంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మెహన్‌బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అప్పట్లో వైశ్రాయి హోటల్ వద్ద అన్నయ్య ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన ఘటనను తన కళ్లారా చూశానని వెల్లడించారు.
గతంలో మోహన్‌బాబు మాట్లాడుతూ..'చంద్రబాబుకు, నాకు దాదాపు 40 ఏళ్ల అనుబంధం. చంద్రబాబు గురించి మీకంటే నాకే బాగా తెలుసు. అతనికి పుట్టుకతోనే అసత్యాలు మాట్లాడటం నరనరాన జీర్ణించుకుపోయింది. తెలుగులో నంబర్‌వన్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు సినిమాలు మానేసి.. తన కుమారుడు హరికృష్ణతో కలిసి ట్రావెల్ చేస్తూ నిద్రాహారాలు మాని తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇండియాలోనే ఓ శతాబ్ద పురుషునిగా నిలిచారు. ఆ మహానుభావుడు ఇతనికి కన్యాదానం చేస్తే.. ఆ మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు. అంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? నన్ను ఎన్టీఆర్ అన్నయ్య రాజ్యసభ ఎంపీగా పంపారు. కానీ వైస్రాయి హోటల్ దగ్గర జరిగిన ఘటనను కళ్లారా చూసినవాణ్ని నేను. అప్పట్లో ఎన్టీఆర్ అన్నయ్య నేను ఏదైనా తప్పు చేసి ఉంటే చెప్పండి.. నా తప్పును సరిదిద్దుకుంటానని అడిగారు. కానీ అక్కడున్న నేతలు ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరారు. ఆ ఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇదీ చంద్రబాబు నైజం. ఎవరినైనా వాడుకుని కరివేపాకులా వదిలేయడం చంద్రబాబు క్యారెక్టర్. అన్నయ్య స్థాపించిన తెలుగుదేశం కాదు అది. చంద్రబాబు లాక్కున్న తెలుగుదేశం. పంచభూతాల సాక్షిగా ఇదే వాస్తవం. ఎన్టీఆర్ కుటుంబాన్ని నిలువున మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. పచ్చి అబద్ధాలకోరు, నీచుడు చంద్రబాబు. ఒకరిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎలా మంచివాడవుతారు.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment