ప్రకాశ్ రాజ్.. ఏ పాత్రలోనైనా ఇట్టే జీవించేయగల సమర్థుడు. దక్షిణాదిన అన్ని భాషల్లో నటించిన ఈయన బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేశాడు. అయితే కొన్నిసార్లు కేవలం డబ్బు కోసమే కథ, పాత్ర నచ్చకపోయినా సదరు సినిమాల్లో నటించానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. 'నేను ఎన్నో సినిమాలు చేశాను. కొన్నిసార్లు నన్ను రిజెక్ట్ కూడా చేశారు. దానివల్ల పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే.. నాకు నో చెప్పడం వెనక ఎంత రాజకీయం జరిగి ఉంటుందో నేను ఊహించగలను. వారు తప్పని పరిస్థితుల్లో నన్ను సినిమా నుంచి తప్పించారనే విషయాన్ని అర్థం చేసుకోగలను.
ఓవరాక్టింగ్.. యాక్టింగ్ చేస్తున్నట్లేగా
అయినా నా లైఫ్‌స్టైల్ వేరేలా ఉంటుంది. ముందు నాకు సౌకర్యంగా ఉందా? లేదా? అనేది చూస్తాను. ఆ తర్వాతే మిగతావాటి గురించి ఆలోచిస్తాను. కొన్నిసార్లయితే కేవలం డబ్బు కోసమే పిచ్చి సినిమాలన్నీ చేశాను. సినిమాలో ఎందుకంత ఓవరాక్టింగ్ చేస్తావని కొందరు అంటుంటారు. వారికి నేను చెప్పే సమాధానం.. నేను నిజంగా ఓవరాక్టింగ్ చేస్తున్నానంటే నాకు నటించడం వచ్చినట్లే కదా! కమర్షియల్ సినిమాలపై ద్వేషం లాంటిదేమీ లేదు. ఆ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. వారి కోసం మేకర్స్ ఎంతో కష్టపడి సినిమాలు తీస్తున్నారు. వారు నన్ను విలన్‌గానే సెలక్ట్ చేసుకుంటున్నారు.
పైసా తీసుకోకుండా ఫ్రీ సినిమాలు
కొన్నిసార్లు.. ఈ చెత్త సినిమాలు చేయడం అవసరమా? అని నాది నాకే అనిపిస్తుంది. కానీ డబ్బు కావాలంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోక తప్పదు కదా! మరికొన్నిసార్లు పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తుంటాను. అప్పుడు ఎందుకిలా ఉచితంగా సినిమాల్లో నటిస్తున్నావని అడుగుతుంటారు. కానీ అలాంటి సినిమాల్లో నటించినప్పుడు, దానికి వచ్చిన రెస్పాన్స్ చూసినప్పుడు పొందిన ఆనందం డబ్బుతో కొలవలేనిది. ఇది నా లైఫ్.. నాకు నచ్చినట్లుగా బతుకుతున్నాను' అని చెప్పుకొచ్చాడు. ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం గుంటూరు కారం, దేవర, పుష్ప 2:ద రూల్ సినిమాలు చేస్తున్నాడు.
చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి.. అశ్వినిని పెళ్లి చేసుకుంటానన్న యావర్
Comments
Please login to add a commentAdd a comment