సినిమా అంటే జనాలకు మాత్రమే రంగుల ప్రపంచమే కాదు.. అవతల నటించే వాళ్లకు కూడా. ‘ఎంత బలవంతులనైనా ఏదో ఒక టైంలో మానసికంగా కుంగుబాటుకు కచ్ఛితంగా గురిచేసేదే సినిమా’ అంటూ స్పీల్‌బర్గ్‌లాంటి దిగ్గజాలు చెప్పడం చూస్తుంటాం. అలా ఎన్నో కలలతో సినిమాల్లోకి అడుగుపెట్టిన సీనియర్ నటి శ్రీవిద్య జీవితం..విషాదంగా ముగియడం మీలో ఎంత మందికి గుర్తుంది?. ఇవాళ ఆమె జయంతి..
మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ.. ఇలా సుమారు 800కు పైగా సినిమాల్లో నటించారు శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్‌గా.. అటుపై సపోర్టింగ్ రోల్స్, అక్కా-చెల్లి, అమ్మ, అత్త క్యారెక్టర్‌లతో అలరించారు. ముఖ్యంగా ఆమె పండించే భావోద్వేగాలు ఇప్పటికీ జనాలకు గురుతు. అందుకే ఎమోషనల్ యాక్ట్రెస్‌గా ఆమెకు ఓ పేరు ముద్రపడింది. కేవలం నటనతోనే కాదు.. తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు, డబ్బింగ్‌తోనూ దక్షిణాది ప్రేక్షకుల్ని రంజింపచేశారామె.
‘నటన’ కుటుంబంలో జననం
1953, జులై 24న మద్రాస్‌లో పుట్టారామె. తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్‌గా స్థిరపడగా, తల్లి వసంతకుమారి కర్ణాటక క్లాసిక్ సింగర్(ఎంఎస్ సుబ్బలక్క్క్ష్మి, డీకే పట్టమ్మస్ సమకాలికురాలు). అయితే శ్రీవిద్య పుట్టిన కొన్నాళ్లకే తండ్రి పక్షవాతం బారినపడడంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో వసంతకుమారి నానాకష్టాలు పడి సంపాదించింది. ఒకానొక టైంలో తనకు పాలు ఇచ్చే సమయం ఉండేది కాదన్న తల్లి మాటల్ని శ్రీవిద్య పలు ఇంటర్వ్యూలో సైతం గుర్తు చేసుకునేవాళ్లు. ‘బొటాబొటీ’ చదువు కొనసాగించిన శ్రీవిద్య అందగత్తె కావడంతో అమెరికా నుంచి ఓ సైంటిస్ట్ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అయితే డబ్బు లేదన్న కారణంతో ఆ సంబంధం అంతే స్పీడ్‌గా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి పరిచయాలతో ఆమె నటనలోకి అడుగుపెట్టారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలై..
1967 తమిళ సినిమా శివాజీ గణేషన్ హీరోగా ‘తిరువరుల్చెల్వర్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారామె. ఆ తర్వాత మలయాళ సినిమా ‘కుమార సంభవం’తో, తెలుగులో దాసరి ‘తాతా మనవడు’తో అరంగ్రేటం చేసింది శ్రీవిద్య. దర్శకదిగ్గజం కే బాలచందర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘నూట్రుక్కు నూరు’(1971) నటిగా ఆమెకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. హీరోయిన్‌గా ‘ఢిల్లీ టు మద్రాస్’(1972) ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత బాలచందర్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాల ద్వారా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చారామె.
మల్టీటాలెంటెడ్
అల్లరి క్యారెక్టర్‌లతో అలరించినా.. మెచ్యూర్డ్‌రోల్స్ చేసినా.. ఆ క్యారెక్టర్‌తో ఎమోషనల్‌గా ట్రావెల్ కావడం ఆమెకు ఉన్న నైజం. అందుకే హీరోయిన్‌గా ఫేడ్‌అవుట్ అయ్యాక ఆమెకు హుందా పాత్రలెన్నో వచ్చాయి. నటిగానే కాదు.. ప్లేబ్యాక్ సింగర్‌గానూ ఆమె అలరించారు. స్వతహాగా క్లాసికల్ సింగర్ కావడంతో ఆమె గాత్రం పాటలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టేవి. అంతేకాదు పదుల సంఖ్యలో సినిమాలకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పారు.
‘ప్రేమ’ మోసం
కెరీర్ తొలినాళ్లలో కమల్ హాసన్‌తో ఆమె నటించింది. ఆ టైంలో ఇద్దరి మధ్య ఎటాచ్‌మెంట్ ఎక్కువగా ఉండేది. ఒకానొక టైంలో కమల్‌తో పీకలలోతు ప్రేమలో కూరుకుపోయిందామె. అయితే అప్పటికే కమల్ వాణీ గణపతితో ప్రేమలో ఉండడంతో ఆమె పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి మలయాళంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జార్జ్ థామస్‌తో ప్రేమలో పడి.. తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకుంది. మతం మార్చుకుని నటనకు దూరమైంది. డబ్బు కోసం తిరిగి నటించాలన్న భర్త ఒత్తిడితో తిరిగి మేకప్ వేసుకుంది. ఆపై భర్త తీరును అర్థం చేసుకుని.. విడాకులిచ్చేసింది. నటన కొనసాగిస్తున్న టైంలో మలయాళ దర్శకుడు భరతన్‌తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం కొనసాగించింది. అయితే భరతన్ మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో భరతన్ తన ఆస్తులు లాగేసుకుని తనను మోసం చేశాడంటూ శ్రీవిద్య కోర్టుకెక్కింది. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో విజయం సాధించి తన ఆస్తుల్ని దక్కించుకున్న ఆమె.. చెన్నై నుంచి తిరువంతపురానికి మకాం మార్చేసింది.
అపూర్వ రాగంగల్-అపూర్వ సగోదరర్‌గల్
చనిపోయే ముందు దాకా..
2003లో అనారోగ్యం పాలైన ఆమెకు.. క్యాన్సర్ అని తేలింది. ఆటైంలో మూడేళ్లపాటు ఆమె చికిత్స తీసుకుంది. ఆ టైంలోనూ ఆమెను వదల్లేదు. అంతేకాదు ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న తాను బతకడం కష్టమనే విషయం అర్థమైయ్యింది ఆమెకు. అందుకే తన పేరు మీద ఒక్క పైసా కూడా ఉండొద్దన్నది నిర్ణయించుకుంది. మొత్తం ఆస్తిని సేవాకార్యక్రమాలకు ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అప్పటికే కేరళ ప్రభుత్వం స్కాలర్‌షిప్ ఆపేయడంతో పేద సంగీత, నృత్య కళాకారులైన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. అందుకని మలయాళ నటుడుని రిజిస్టర్‌గా నియమిస్తూ.. తన ఆస్తులను అప్పజెప్పింది. తద్వారా ఓ ఛారిటబుల్ సొసైటీ ఏర్పాటు చేయించి అర్హులైనవాళ్లకు స్కాలర్‌షిప్ అందించే ఏర్పాటు చేయించింది.
మిగిలిన ఆస్తిని బంధువుల పేరిట రాసేసింది. తన అన్నల పిల్లలకు ఒక్కొక్కరి ఐదు లక్షలు, చివరికి తన ఇంట్లో పని వాళ్లు.. వాళ్ల ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జమ చేయించింది. మరికొంత ఆస్తిని సొంత వూరికి, ఇంకొంత సొమ్మును రెండో ఇల్లు తిరువనంతపురానికి దానం చేసింది. ఆ తర్వాత కీమో థెరపీకి వెళ్లిన ఆమె.. ఆ ట్రీట్‌మెంట్ టైంలోనే 2006, ఆగస్టు 17న యాభై మూడేళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఆమె సేవానీరతికి గుర్తుగా తిరువనంతపురం ప్రజలు లాంఛనంగా ఆమె అంత్యక్రియల్ని ఘనంగా జరిపించారు.
తల్లిగా ప్రత్యేకం
నలభై ఏళ్లపాటు మలయాళం, తమిళంలో వందలకొద్దీ, తెలుగులో నలభై దాకా, కన్నడలో డజను, హిందీలో రెండు.. మొత్తం 800 దాకా సినిమాల్లో నటించారామె. ఇక సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ తొలి హీరోయిన్ శ్రీవిద్యే. ఆయన మొదటి సినిమా అపూర్వ రాగంగల్(1975) రజినీ జోడిగా. అయితే రజినీతో హీరోయిన్‌గానే కాదు.. అక్కగా, చెల్లిగా, తల్లిగా, అత్తగా.. ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్‌లలో ఆమె నటించడం విశేషం. తల్లి క్యారెక్టర్‌లో శ్రీవిద్య అద్భుతమైన నటన కనబరిచేవారామె. ముగ్గురు మొనగాళ్లు, గాండీవం, చిన్నబ్బాయ్, వెంకటేష్‌కు తల్లిగా ‘బ్రహ్మపుత్రుడు’, ‘ధర్మచక్రం’ ఆమె మరిచిపోలేని నటనను అందించారు. సుమంత్ హీరోగా వచ్చిన ‘విజయ్ ఐపీఎస్’ తెలుగులో శ్రీవిద్య నటించిన చిట్టచివరి చిత్రం.
-సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment