బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన భారతదేశ మొట్టమొదటి రాణి వీరమంగై వేలు నాచ్చియార్ జీవిత చరిత్ర సినిమాగా రానుంది. వేలు నాచ్చియార్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ పతాకంపై జేఎం.బషీర్ నిర్మిస్తున్నారు. ఆర్.అరవింద్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో టైటిల్ పాత్రను నటి ఆయిషా పోషిస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. దీనికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించడం విశేషం.
కాగా ఇందులో పెరియమరుద అనే ముఖ్య పాత్రను ఈ చిత్ర నిర్మాత, నటుడు జేఎం.బషీర్ పోషిస్తున్నారు. ఈ చిత్ర పరిచయ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని దేవర్ మహల్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జేఎం.బషీర్ మాట్లాడుతూ.. వేలు నాచ్చియార్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడం గర్వంగా ఉందన్నారు. ఇందులో టైటిల్ పాత్రను తన కుమార్తె ఆయిషా పోషించడం ఇంకా సంతోషంగా ఉందన్నారు.
మన దేశం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన తొలి మహిళారాణి గురించి ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్న సదుద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. తాను నటించిన దేశీయ తలైవర్ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని, ఆ తరువాత వేలు నాచ్చియార్ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి జె.శ్రీధర్ చాయాగ్రహణం అందించనున్నారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జేఎం.బషీర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment