బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై జరగిన దాడితో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇంతటి ఘోరం జరగడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. గ్యాంగ్‌స్టర్స్‌తో ఒకప్పుడు నిండిపోయిన ముంబైలో కొన్నేళ్ల తర్వాత ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే, గతంలో కూడా ఇలాంటి దాడులో బాలీవుడ్ నటీనటులపై జరిగాయి.
పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన సింగర్ చమ్కీలాపై తూటాల వర్షం
భారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా.. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు.
మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం.
క్యాసెట్ కింగ్‌పై కాల్పులు
‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్‌ను 1997 ఆగస్టు 12న దుండగులు కాల్చి చంపారు. ఆ సమయంలో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సబర్బన్ అంధేరీలోని శివాలయాన్ని ప్రతిరోజూ రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) దర్శించుకునేవారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.
బుల్లెట్ల గాయాలతోనే ఆసుపత్రికి వెళ్లిన స్టార్ హీరో తండ్రి
2000వ సంవత్సరం రోషన్ కుటుంబానికి చేదు గుర్తులనే మిగిల్చింది. హృతిక్ రోషన్ తొలి చిత్రం కహో నా.. ప్యార్ హై అతనికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే కొద్ది రోజులకే వారికి పెద్ద ప్రమాదమే ఎదురైంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్‌పై ముంబైలోని అతని కార్యాలయం వెలుపల అండర్ వరల్డ్‌తో సంబంధం ఉన్న కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అతనికి రెండు బుల్లెట్లు తగిలినప్పటికీ ఎంతో వీరోచితంగా తన కారులోనే డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాడు. అలా ప్రాణాలతో ఆయన బటయపడ్డాడు.
షారూఖ్ ఖాన్‌కు పలుమార్లు హెచ్చరికలు
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఇప్పటికే పలు బెదిరింపులు వచ్చాయి. 1990ల్లో షారుక్‌ను అండర్‌వరల్డ్ టార్గెట్ చేసింది. గ్యాంగ్‌స్టర్ అబూసలేం అనేకసార్లు షారుఖ్‌కు వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ, ఖాన్ మాత్రం చాలా ధైర్యంగా వారికి వ్యతిరేకంగా పోరాడారు. సల్మాన్ ఖాన్‌కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే వారి నుంచి షారుఖ్ ఖాన్‌కు కూడా గతంలో వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్‌ఫోన్‌కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు.
ప్రీతీజింటా ధైర్యం
2001 సమయంలో అండర్‌వరల్డ్‌కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతీజింటా కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఆ సమయంలో తను నటించిన 'చోరీచోరీ చుప్కే చుప్కే' సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఆమె ఎదుర్కొంది. ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టిన నిర్మాత నజీమ్ రిజ్వీతో పాటు ఫైనాన్షియర్ భరత్ షా అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ నుంచి వచ్చిన డబ్బుతో సినిమా తీసినట్లు అభియోగాలు మోపారు.
ఈ కేసు విచారణ సమయంలో రూ.50లక్షల కోసం తనను డిమాండు చేస్తూ బెదిరింపులు వచ్చాయని కోర్టులో ఆమె చెప్పారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, మహేష్ మంజ్రేకర్ వంటి వారితో సహా ఇతర బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ, ప్రీతీ మాత్రమే కోర్టుకు తెలిపింది. అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నసీం రిజ్వీ, ఫైనాన్సర్ భరత్ షాలు జైలుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment