‘‘నటన పరంగా అమ్మానాన్న (సుమ, రాజీవ్ కనకాల) సలహాలు తీసుకుంటాను. ‘బబుల్‌గమ్’ మూవీని వారు చూశారు.. బాగా నచ్చింది. ఆ టైమ్‌లో నేను అక్కడ లేను. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నాన్న ఎమోషన్ అయి, ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్నని అడిగితే ‘బాగా చేశావ్’ అన్నారు. ఆయన్నుంచి ప్రశంస రావడం ఆనందంగా అనిపించింది’’ అని రోషన్ కనకాల అన్నారు.
రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల, మానసా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘బబుల్‌గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా రోషన్ కనకాల మాట్లాడుతూ– ‘‘నా బాల్యం అంతా దాదాపుగా తాతగారి (దేవదాస్ కనకాల) నటనా శిక్షణ కేంద్రంలో గడిచింది. నాకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం. అది తెలియని ఒక థ్రిల్ ఇస్తుంది. నటుడు కావాలనే నా కల ‘బబుల్‌గమ్’తో నెరవేరడం ఆనందంగా ఉంది. న్యూ ఏజ్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది.
సినిమా షూటింగ్‌కి వెళ్లే నెల రోజుల ముందే వర్క్ షాప్ నిర్వహించడం మాకు ప్లస్ అయింది. ఈ మూవీలో ఓ సీన్ కోసం దాదాపు మూడు గంటలు పాటు షర్టు లేకుండా తిరిగాను. మొదట్లో సిగ్గుపడ్డా... ఆ తర్వాత పోయింది (నవ్వుతూ). మా అమ్మానాన్నలకు పరిశ్రమలో చాలా మంచి పేరుంది. నేను హీరోగా వస్తుండటం బాధ్యతగా అనిపిస్తోంది. ఫలానా జోనర్ మూవీ చేయాలనే ఆలోచన నాకు లేదు. ప్రేక్షకులను అలరించే మంచి సినిమాలు చేయడం ఇష్టం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment