Celebrities Weight Loss Transformation Story - Sakshi
Sakshi News home page

Celebrities Transformation: తగ్గేదే లే అంటూనే తగ్గారు.. ఎందులో తగ్గారో తెలుసా ?

Published Wed, Dec 8 2021 8:25 AM | Last Updated on Wed, Dec 8 2021 2:38 PM

Celebrities Weight Loss Transformation Story - Sakshi

Celebrities Weight Loss Transformation Story: తగ్గేదే లే అంటున్నారు.. కానీ తగ్గారు. మరి.. ఏ విషయంలో తగ్గేదే లే అంటే.. నటనపరంగా తగ్గేదే లే అంటూ విజృంభిస్తున్నారు. ఏ విషయంలో తగ్గారు అంటే.. బరువు తగ్గారు. సినీ సెలబ్రిటీలకు అందంతోపాటు ఫిట్‌నెస్‌ కూడా ఎంతో ముఖ్యం. అందుకే వయసు పెరిగినా ఫిట్‌నెస్‌ మాత‍్రం కచ్చితంగా పాటిస్తారు కొందరు సినీ తారలు. అందంగా ఆరోగ్యంగా ఉండటానికి ‘ఫిట్‌ అండ్‌ ఫైన్‌’ అంటున్నారు. సీనియర్‌ తారలు జయసుధ, ఖుష్బూ, ప్రభు బాగా బరువు తగ్గి కొత్త లుక్‌లోకి మారిపోయారు. ఆ లుక్‌ని ఓ లుక్కేద్దాం. 

‘‘నవ్వండి.. ఉచితంగా లభించే మంచి థెరపీ అది’’ అంటున్నారు జయసుధ. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఆమె బరువు తగ్గాక సోషల్‌ మీడియాలో ఓ ఫోటో షేర్‌ చేసి, ఈ విధంగా పేర్కొన్నారు. కొన్ని నెలలుగా అమెరికాలో ఉంటున్న ఈ సహజ నటి అక్కడే బరువు తగ్గే పనిలో పడ్డట్లున్నారు. మామూలుగా సినిమా తారలు బరువు తగ్గితే ఏదైనా పాత్ర కోసం అనుకుంటారు. కానీ ఫిట్‌నెస్‌లో భాగంగానే ఆమె తగ్గారు. పైగా బరువు తగ్గే క్రమంలో ఆమె శాకాహారానికి కూడా మారారని తెలుస్తోంది. ఎందుకంటే ‘వీగన్‌ ఫుడ్‌ ట్రై చేద్దాం’ అని ట్వీట్‌ చేశారు. 

ఇక ఫిట్‌నెస్‌లో భాగంగానే తగ్గిన మరో తార ఖుష్బూ విషయానికొస్తే.. ఆ మధ్య 15 కిలోలు బరువు తగ్గానంటూ ఓ ఫొటో షేర్‌ చేశారామె. తాజాగా వెయిట్‌ మిషన్‌పై నిలబడి చూసుకుని, మరో ఐదు కిలోలు తగ్గానోచ్‌ అన్నారు. అంటే.. మొత్తం 20 కిలోలు తగ్గించేశారు. ఇలా తగ్గడంవల్ల ఆమె ఆరోగ్యం బాగాలేదని కొందరు అనుకున్నారట. ‘‘నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఎక్కడ అనారోగ్యానికి గురయ్యానో అని కొందరు ఆందోళన పడ్డారు. నా పట్ల వారికున్న అభిమానానికి ధన్యవాదాలు. అసలు నేనింత ఫిట్‌గా ఎప్పుడూ లేను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకునే తగ్గాను. ఈ విషయంలో నేను పది మందికి ఆదర్శంగా నిలిస్తే విజయం సాధించినట్లే’’ అన్నారు ఖుష్బూ. 

ఈ బ్యూటీ కథానాయికగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రభు సరసన కొన్ని సినిమాల్లో నటించారు. 1990లలో ఈ ఇద్దరిదీ ‘హిట్‌ పెయిర్‌’. విశేషం ఏంటంటే.. ఇప్పుడు ప్రభు కూడా తగ్గారు. ఖుష్బూలానే ఆయన కూడా 20 కిలోలు వెయిట్‌ లాస్‌ అయ్యారు. అయితే ఫిట్‌నెస్‌లో భాగంగా తగ్గలేదు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కోసం తగ్గారని కోలీవుడ్‌ టాక్‌. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభు కీలక పాత్ర చేస్తున్నారట. ఈ పాత్రలో స్లిమ్‌ లుక్‌లో కనిపించాల్సి రావడంతో వెయిట్‌ తగ్గినట్లు తెలుస్తోంది. 

క్యారెక్టర్‌ కోసమో, ఫిట్‌నెస్‌ గురించో సీనియర్లు ఇలా తగ్గడం చూసి ‘భేష్‌.. నటన విషయంలోనే కాదు... తగ్గే విషయంలో కూడా మీరు ఆదర్శమే’ అని కొందరు యువతారలు అంటున్నారు. అభిమానులైతే ఖుషీ అయిపోతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement