Megastar Chiranjeevi Emotional Comments On Acharya Pre Release Event, Full Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi's Acharya: అక్కడ అది చూశాక చాలా అవమానంగా అనిపించింది

Published Sun, Apr 24 2022 9:26 AM | Last Updated on Sun, Apr 24 2022 12:34 PM

Chiranjeevi Emotional Comments On Acharya Pre Release Event - Sakshi

‘‘రాజమౌళిగారు ఓ బాట వేశారు. ఇక ఏ డైరెక్టర్‌ తీసినా సరే అది ఇండియన్‌ సినిమా అయిపోతుంది. మొన్న సుకుమార్‌గారు తీసిన ‘పుష్ప’ ఇండియన్‌ సినిమా అయిపోయింది. ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీఎఫ్‌’ పాన్‌ ఇండియన్‌ అయిపోయింది. అల్లు అర్జున్‌, యశ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌.. అఫ్‌కోర్స్‌ వీరందరి కంటే ముందు ప్రభాస్‌... పాన్‌ ఇండియన్‌ స్టార్స్‌ అయ్యారు. కంటెంట్‌లో బలం ఉంటే ఏ ప్రాంతం వారయినా అందరూ పాన్‌ ఇండియన్‌ స్టార్సే. అన్నీ పాన్‌ ఇండియా చిత్రాలే, అందరూ పాన్‌ ఇండియా డైరెక్టర్సే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ అనే తేడాలు చెరిగిపోవాలి. భాషతో సంబంధం లేకుండా ఇది ఇండియన్‌ సినిమా. ప్రతి యాక్టర్‌ కూడా ఇండియన్‌ యాక్టర్‌.. అనేది రావాలి.. వచ్చింది’’ అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా నటించారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ – ‘‘1988లో నాగబాబు ‘రుద్రవీణ’ సినిమా నిర్మించారు. ఆ సినిమాకు నేషనల్‌ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకోవడానికి మేం ఢిల్లీ వెళ్లాం. కార్యక్రమానికి ముందు హైటీ ఉంటుంది. ఆ హాలులో ఇండియా సినిమా వైభవం అంటూ కొన్ని సినిమాల పోస్టర్స్, యాక్టర్స్‌.. అంటూ క్లుప్తంగా కొంత నోట్స్‌ ఉంది. పృథ్వీ రాజ్‌కుమార్, దిలీప్‌కుమార్, దేవానంద్, అమితాబ్‌ బచ్చన్, రాజేష్‌ ఖన్నా, ధర్మేంద్రగార్ల ఫొటోలు ఉన్నాయి. ఎమ్‌జీఆర్‌గారు, జయలలితగారు ఉన్న స్టిల్‌ వేసి సౌత్‌ సినిమా అని రాశారు. ఆ తర్వాత ప్రేమ్‌ నజీర్‌గారి ఫోటో ఉంది. అంతే... కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌గారిది కానీ విష్ణువర్ధన్‌ గారిది కానీ, మన గొప్ప నటులు ఎన్టీ రామారావుగారు, నాగేశ్వరరావుగార్లు కానీ, తమిళంలో శివాజీ గణేశన్‌ గారి ఫోటోలు కానీ లేవు.

ఆ సమయంలో నేను చాలా హ్యూములిటీకి లోనయ్యాను. చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్‌ సినిమా అంటే ఏదో హిందీ సినిమా అన్నట్లు ప్రొజెక్ట్‌ చేశారు. ఇటు ప్రాంతీయ సినిమాలకు కూడా సరైన గౌరవం ఇచ్చినట్లు నాకు అనిపించలేదు. ఆ తర్వాత నేను మద్రాస్‌లో కూడా ఈ విషయాలను ప్రెస్‌తో పంచుకున్నాను. కానీ నా ప్రశ్నలకు సమాధానం రాలేదు. ఆ తర్వాత తర్వాత నేను గర్వపడేలా, రొమ్ము విరుచుకునేలా తెలుగు సినిమా హద్దులు, ఎల్లలు చెరిపేసింది. మావన్నీ ఇండియన్‌ సినిమాలే అని ప్రతి ఒక్కరు గర్వపడేలా, ఆశ్చర్యపోయేలా ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఇలాంటి సినిమాలు మనం రొమ్మువిరుచుకుని నిలబడేలా చేశాయి. అలాంటి సినిమాల రూపకర్త రాజమౌళి. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళిగారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన రాజమౌళిని సభాముఖంగా అభినందిస్తున్నాను.

రాజమౌళిగారు ప్రోత్సహించడం వల్లే ‘ఆచార్య’ సాధ్యమైంది. చరణ్‌ను, నన్ను కలిసి స్క్రీన్‌పై సురేఖ చూడాలనుకుంటున్నారని చెప్పిన తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తున్నప్పటికీ చరణ్‌ ‘ఆచార్య’ చేయడానికి రాజమౌళిగారు ఒప్పుకున్నారు. నిర్మాత నిరంజన్‌ రెడ్డి మా ఇంటి సభ్యుడైపోయారు. ‘డాడీ సినిమాలో నేను కనబడితే చాలు అని!’ శివతో చరణ్‌ అన్నాడట. నేనంటాను... చరణ్‌ ఉన్న తర్వాత నేను కనపడతానా? లేదా? అన్న డౌట్‌ వచ్చింది. రాజమౌళిగారితో సినిమాలు చేసి హిట్‌ కొట్టిన హీరోలకు, వారి తర్వాతి సినిమాలు ఫ్లాప్స్‌ అనే టాక్‌ విన్నాను. అది ‘ఆచార్య’ రూపుమాపుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ‘ఆచార్య’ మరో హిట్‌ అవుతుంది’’ అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘మగధీర’ టైమ్‌లో కథ చెప్పినపుడు చరణ్‌ విషయాలు చిరంజీవిగారే దగ్గరుండి చూసుకుంటారనుకున్నాను. కానీ తర్వాతి కాలంలో చిరంజీవిగారు చరణ్‌కి ఎటువంటి సలహాలు ఇవ్వరని తెలుసుకున్నాను. తన తప్పులను దిద్దుకొని, దర్శకుడు చెప్పిన ప్రతీది నేర్చుకొని, తనకు తానుగా ఎదిగిన వ్యక్తి రామ్‌చరణ్‌. చిరంజీవిగారు తనతో కలిసి నటించే వ్యక్తులతో, చివరికి ఆయన కొడుకైనా కూడా తానే డామినేట్‌ చేయాలని కోరుకుంటారు. ఇది చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. చిరంజీవిగారి అభిమానిగా చెబుతున్నా... చిరంజీవిగారు ఎంత బాగా నటించినా నా హీరో చరణే.. సినిమాలో బాగా నటించాడు (నవ్వుతూ). మంచి సందేశాలిచ్చే సినిమాల దర్శకుడు కొరటాల శివ. మాస్‌ చిత్రంగా ముందుకు వస్తున్న ‘ఆచార్య’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘నాన్‌ కరెప్ట్‌ ఇండస్ట్రీ ఇండియాలో ఉందంటే అది సినిమా ఇండస్ట్రీనే. సినిమాల ద్వారానే నిజమైన గౌరవం, గుర్తింపు లభిస్తాయి. నేను మా నాన్నగారిని ఇన్నేళ్లుగా చూసి ఎంత నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ, మారేడుమిల్లిలో 20 రోజులు నాన్నగారితో నటించి, దగ్గరగా చూసి నేర్చుకున్న అనుభవాలతో పోలిస్తే ఈ 20 ఏళ్లు నథింగ్‌ అనిపించింది. నాన్నగారితో నటించడం డబుల్‌ బొనాంజాలా భావిస్తున్నా. మా నిర్మాతలు పెద్ద పిల్లర్స్‌గా నిలిచారు’’ అన్నారు.

నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘1991లో నిర్మల్‌లోని ఓ థియేటర్‌కు వచ్చారు చిరంజీవిగారు. రోడ్లపై ఉన్న ఆ జనసందోహంలో నేనూ ఒకడిని. చిరంజీవిగారిని కలిస్తే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయనతో సినిమా చేయగలిగా. యాక్టర్స్, రెమ్యునరేషన్స్‌ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అసలు పారితోషికం తీసుకోకుండానే సినిమా చేశారు. సినిమా రానివ్వండి.. వచ్చిన తరవాత తీసుకుంటాము అని నాకు సపోర్ట్‌ చేసిన నా ఇద్దరు హీరో (చిరంజీవి–చరణ్‌)లు, దర్శకుడికి థ్యాంక్స్‌. సినిమాల బిజినెస్‌ ఆంధ్రాలో ఎక్కువగా ఉండేది. తెలంగాణలో తక్కువ. అలా తెలంగాణలో బిజినెస్‌ పరంగా కోటి, రెండు కోట్లు, మూడు కోట్లు .. ఇలా సినిమాల కలెక్షన్స్‌ పెరిగాయి. ఫలితంగా థియేటర్స్‌ పెరిగాయి. చిరంజీవిగారి సినిమాలతోనే అది జరిగింది. ఈ రోజు తెలుగు సినిమా పాన్‌ ఇండియా గురించి ఆలోచించగులుతోందంటే కారణం చిరంజీవిగారే’’ అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారి సినిమాల టికెట్ల కోసం కొట్టుకొని చొక్కాలు చించుకున్నాం. ఆయన్ను చూస్తే చాలు, కలిస్తే చాలనుకుంటే ఇప్పుడు ఆయనతో కెమెరా, యాక్షన్‌ అంటూ సినిమాకి  దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. సినిమాకు ‘ఆచార్య’ అని టైటిల్‌ పెట్టాం. కానీ మాకు చిరంజీవి అనే ఒక ఆచార్య దొరికారు’’ అన్నారు.

చదవండి: ఈ సినిమాలో మాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు: రామ్‌చరణ్‌

 వెబ్‌ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న మోడల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement