పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ముందు హీరో విక్రమ్ కెరీర్‌లో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. ఆయన నటించిన చిత్రాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం, కొన్ని చిత్రాలు తెరపైకి వచ్చినా ఆశించిన విజయాలను అందుకోక పోవడం వంటివి జరిగాయి. అలాంటి సమయంలో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ విక్రమ్‌కు మంచి బూస్ట్ నిచ్చిందనే చెప్పాలి. తాజాగా పా. రంజిత్ దర్శకత్వంలో ఈయన నటించిన తంగలాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
నటుడిగా పాత్రలకు జీవం పోసే విక్రమ్ గెటప్ ఈ చిత్రంలో చాలా వైవిధ్యంగా ఉంది. దీంతో తంగలాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల కోసం విక్రమ్, మాళవిక మోహన్‌తోపాటు యూనిట్ వర్గాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా విక్రమ్ కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన ధ్రువనక్షత్రం చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆ చిత్రం ఇప్పుడు తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
ఇకపోతే విక్రమ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించి అరుణ్ కుమార్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం చిత్తా(తెలుగులో చిన్నా పేరిట విడుదలైంది). ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను అందుకుంది. కాగా ఈ దర్శకుడు విక్రమ్ కథానాయకుడిగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని శింబు తమీన్ నిర్మించనున్నారని తెలిసింది. ఈయన ఇంతకుముందు విక్రమ్ ద్విపాత్రాభినయం చేసిన ఇరుముగన్ చిత్రాన్ని నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment