
Devi Sri Prasad Birthday: సంగీతంతో మ్యూజిక్ ప్రియులను ఉర్రూతలూగించే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నిన్న (ఆగస్టు 2) పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు డీఎస్పీకి బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. అయితే నిన్న డీఎస్పీ విజయవాడలోని గన్నవరంలో ఉన్నాడు. అక్కడ డ్యాడీస్ హోమ్‌లో అనాథ చిన్నారుల మధ్య గడిపాడు. చిన్నారులను చూసి చలించిపోయిన డీఎస్పీ వారందరి కోసం ఆగస్టు నెల సరుకులు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశాడు.
'మీ ప్రేమాభిమానాలకు ఇదే నా వందనం.. నా బర్త్‌డే సందర్భంగా మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. గన్నవరంలో డ్యాడీస్ హోమ్ అని ఒక అనాథాశ్రమం ఉంది. ఇది తల్లిదండ్రులు లేని వందలాది మంది చిన్నారుల బాగోగులు చూసుకుంటుంది. ఈ చిన్నారులపై వారు చూపించే శ్రద్ధ, నిస్వార్థ సేవ నా మనసును తాకింది. గతంలో సర్‌ప్రైజ్ అంటూ నన్ను ఇక్కడికి తీసుకురాగా, వాళ్ల కోసం నేను సంగీతం వాయించాను. అప్పటినుంచి వాళ్లతో కనెక్ట్ అయిపోయాను. ఈ ఆశ్రమంలోని కొందరు చిన్నారుల బాగోగులను చూసుకోవడం నా బాధ్యతగా స్వీకరిస్తున్నా. అలాగే అందరికీ ఈ నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందిస్తాను' అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.