సాక్షి, ముంబై: దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా ఒక అందమైన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిరు, మేఘనా తనయుడు రాయన్ రాజ్‌తో ఆడుకుంటూ, ముద్దాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. భార్య ప్రేరణతో కలిసి రాయల్ రాజ్‌ను ఎత్తుకున్న ఫోటోను, అలాగే బుజ్జి రాయన్ కాలితో ధృవను తన్నుతున్న ఫోటో కూడా యాడ్ చేశారు. దీనిపై తల్లి మేఘనా రాజ్ భావోద్వేగంతో స్పందించారు. అటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.
సోదరుడు అకాల మరణం తరువాత మేఘనను అక్కున చేర్చుకొని అన్నీ తానే అయి చూసుకున్నాడు ధృవ. ఈ క్రమంలో భర్తలేని లోటు తెలియనివ్వకుండా మేఘనాకు ఘనంగా సీమంతం కూడా జరిపించాడు. అంతేకాదు తన అన్నయ్యే మళ్లీ పుడతాడంటూ రూ. 10 లక్షల విలువ చేసే వెండి ఉయ్యాలను బహుమతిగా ఇవ్వడం అప్పట్లో విశేషంగా నిలిచింది.
2018లో చిరు సర్జా, నటి మేఘనా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతా హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న తరుణంలో పెళ్లైన రెండేళ్లకే చిరు సర్జా మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గతేడాది జూన్ 7న తీవ్ర గుండెపోటుతో 35 ఏళ్లకే కన్నుమూశారు. అప్పటికే గర్భవతిగా ఉన్న మేఘనాను ఈ సంఘటన హతాశురాలిని చేసింది. అయితే అక్టోబర్ 22న పండంటి మగబిడ్డకు జన‍్మనివ్వడంతో ఈ విషాదంనుంచి మేఘనకు కాస్తంత ఊరట లభించింది.
తరచూ తన భావాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే మేఘనా తన చిన్నారి, జూనియర్ చిరు పేరును ‘‘రాయన్ రాజ్’’ అంటూ ఇటీవల ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేశారు. కాగా తెలుగులో బెండు అప్పారావు, లక్కీ తదితర చిత్రాల్లో నటించిన మేఘనా, చిరంజీవి సర్జాతో ‘ఆటగార’, ‘రామ్‌లీలా’ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment