
‘‘కేజీఎఫ్’ తొలి భాగం రిలీజ్ అయ్యేవరకు నాలాంటి వాళ్లకు కూడా ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్ అయ్యాక మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేసినందుకు ఆ టీమ్‌కి హ్యాట్సాఫ్. ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’తో చరిత్ర సృష్టించబోతున్నారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రంపై సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడారు.
‘‘కన్నడ ఇండస్ట్రీ గురించి చెబితే చిన్న సినిమాలు తీస్తారు, ఐదు కోట్ల బడ్జెట్‌తోనే తీస్తారనుకునేవాళ్లం. యశ్‌తో ప్రశాంత్ ‘కేజీఎఫ్’ సినిమా మొదలు పెట్టినప్పుడు బడ్జెట్ చూసి కొందరు ఆశ్చర్యపోయారు.. మరికొందరు కర్నాటకలోని రెవెన్యూకి మించి ఖర్చు పెడుతున్నాడు.. పిచ్చా వీడికి అనుకున్నారు. ఈ మధ్య వచ్చిన ‘పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలు వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేసినట్లు ‘కేజీఎఫ్ 2’ కూడా చరిత్ర క్రియేట్ చేస్తుంది. ఇండియన్ ఫిల్మ్ గర్వపడే రేంజ్‌కి ఎదిగినందుకు ప్రశాంత్‌కి, యశ్‌కి, విజయ్‌కి అభినందనలు’’ అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో ‘కేజీఎఫ్’ చాలా పెద్ద ప్రయాణం. ప్రతి సినిమాను ఆదరించే తెలుగు ఆడియన్స్ అంటే నాకు చాలా గౌరవం.
ప్రశాంత్ నీల్ ప్రపంచం, ఆలోచనలు, కలల ప్రతిరూపమే ‘కేజీఎఫ్’ సినిమాలు. విజయ్‌గారు విజనరీ ఉన్న ప్రొడ్యూసర్. ‘కేజీఎఫ్’ రిలీజ్ చేసేందుకు సాయి కొర్రపాటిగారు చాలా ఎఫర్ట్ పెట్టారు. ‘బాహుబలి’ లాంటి సినిమాతో అన్ని ఇండస్ట్రీల వారికి నమ్మకాన్ని ఇచ్చిన రాజమౌళి, శోభు యార్లగడ్డ, ప్రభాస్‌గార్లకు థ్యాంక్స్. తెలుగు డైలాగులు, డబ్బింగ్, పాటల విషయంలో కన్నడ కంటే పదిరెట్లు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాం. రామారావుగారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు.. ఆయన పనే మాట్లాడుతుంది. ‘కేజీఎఫ్ 2’ తల్లీ–కొడుకు. కుటుంబంతో కలిసి చూసి, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా తీసినందుకు కర్నాటక చాలా గర్వపడుతుంది. కానీ ఇది ఇండియన్ సినిమా. తెలుగువారు ఎక్కడున్నా మా సినిమాని బాగా ఆదరిస్తారని ఓవర్‌సీస్‌లో వస్తున్న బుకింగ్స్ చూస్తుంటే అర్థమవుతోంది.
మా సినిమా మీ నమ్మకాన్ని, అంచనాలను అందుకుంటుంది’’ అన్నారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తనయుడు, హోంబలే ఫిలింస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామారావు మాట్లాడుతూ–‘‘కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలని చెప్పే విజయ్ కిరగందూర్ ఏకంగా పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు’’ అన్నారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ– ‘‘కైకాల సత్యనారాయణగారి సమర్పణలో ‘కేజీఎఫ్ 2’ చేశాం. ఆ లెజెండరీ పేరుకు తగ్గట్టు సినిమా తీశామనే నమ్మకం ఉంది. సాయిగారిలాంటి వాళ్లు అరుదుగా ఉంటారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా గురించి చెప్పాల్సి వస్తే మొదట రాజమౌళి సార్ గురించి మాట్లాడాలి. యశ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు’’ అన్నారు. ఈ సమావేశంలో కెమెరామేన్ భువన్, డైలాగ్ రైటర్ హనుమాన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment