రాజమౌళి పేరు చెప్పే అర్హత నాకిప్పుడు లేదు: డైరెక్టర్‌ | Director Prashanth Reddy Talk About Bhaje Vayu Vegam Movie | Sakshi
Sakshi News home page

చిన్న గ్యాప్‌ ఇవ్వకుండా ఎంగేజ్‌ చేసే సినిమా ‘భజే వాయు వేగం’ : డైరెక్టర్‌

Published Tue, May 28 2024 4:11 PM | Last Updated on Tue, May 28 2024 4:35 PM

Director Prashanth Reddy Talk About Bhaje Vayu Vegam Movie

‘మా ఊర్లో(మెదక్‌) రాజమౌళి దర్శకత్వం వహించిన ‘సై’ సినిమా షూటింగ్‌ జరిగింది. అది చూసిన తర్వాతే నాకు ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక ఏర్పడింది. రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకొనే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ విషయం చెప్పేందుకు ఇప్పుడు నాకున్న అర్హత సరిపోదు. నా సినిమా(భజే వాయు వేగం) విడుదలై అందరికి నచ్చితే.. అప్పుడు రాజమౌళి గారే నా ఇన్‌స్పిరేషన్‌ అని గర్వంగా చెబుతా’అని అన్నాడు యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘భయే వాయు వేగం’. కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రశాంత్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

యూవీ క్రియేషన్స్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. రన్ రాజా రన్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాను. ఆ తర్వాత సాహోకు కంటిన్యూ అయ్యాను. కోవిడ్ కు ముందు భజే వాయు వేగం  ఓకే అయ్యింది. కార్తికేయ అప్పడు చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క చేస్తున్నాడు. కోవిడ్ వల్ల ఏడాదిన్నర టైమ్ వేస్టయింది. "భజే వాయు వేగం" సినిమా షూటింగ్ మొదలుపెట్టి 70 పర్సెంట్ కంప్లీట్ చేసిన తర్వాత కార్తికేయ బెదురులంక షూటింగ్ కు వెళ్లాడు. అది ఫినిష్ చేసి వచ్చాక మా "భజే వాయు వేగం" కంప్లీట్ చేశాం.

‘భజే వాయు వేగం’ కథ ప్రకారం ఫస్టాఫ్ కు ఒక పర్ ఫార్మర్ కావాలి. సెకండాఫ్ లో హీరోయిజం ఎలివేట్ కావాలి. అలా చూస్తే కార్తికేయ నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించాడు. అతను పర్ ఫార్మెన్స్ చేస్తాడు, హీరో పర్సనాలిటీ ఉంటుంది. కార్తికేయను ఎంచుకోవడానికి కారణమిదే. అలాగే హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో పెరిగే సంప్రదాయబద్దమైన అమ్మాయి. ఐశ్వర్య మీనన్ ప్రొఫైల్ చూస్తుంటే మొత్తం హాఫ శారీ, చీరకట్టులో ఫొటోస్ తో కనిపించింది. ఆమె ఈ మూవీలో ఇందు క్యారెక్టర్ కు కరెక్ట్ ఆప్షన్ గా భావించా.

ఈ  సినిమా కొంత డిలే కావడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎడిట్ చేసిన వెర్షన్ ఫుటేజ్ పోయింది. మళ్లీ ఆ ఎడిటింగ్ కోసం మూడు నెలల టైమ్ అదనంగా పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ కోసం కొంత టైమ్ అదనంగా తీసుకున్నాం. ఫస్ట్ సినిమాకు ఇలా కొంత డిలే కావడం ప్రెజర్ గానే ఉండేది.

ట్రైలర్ లో ఫాదర్ సెంటిమెంట్ అనేది రివీల్ చేశాం. అయితే ఫాదర్ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఓల్డ్ కాదు. ట్రైలర్ చివరలో మీ నాన్న కాదు మా నాన్న అని రాహుల్ కార్తికేయతో చెప్పడం కూడా కథ తెలిసిపోయిందని కొందరు కామెంట్ చేశారు. కానీ మీకు ట్రైలర్ చూపించింది రేపు థియేటర్ లో చూడబోయే కథకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. కథను రివీల్ చేయకూడదనే ట్రైలర్ లో ఎలాంటి ట్విస్ట్ లు చూపించలేదు. 

ఊరి నుంచి పట్టణానికి మనమంతా ఏదో ఒకటి సాధించాలని వస్తాం. అలా వచ్చిన క్రమంలో ఇక్కడ కొన్ని పోగొట్టుకుంటాం. కొన్ని సంపాదిస్తాం. చివరకు మన గోల్ రీచ్ అయ్యామా లేదా అనేది చూసుకుంటాం. అనుకున్నది సాధించని వాళ్లూ ఉంటారు. హీరో అలా ఒక గోల్ మీద సిటీకి వస్తాడు. అతను తన గోల్ గురించి ప్రయత్నిస్తున్న టైమ్ లో వేరే సమస్యలు చుట్టుముడతాయి. తన లక్ష్యం వదిలేసి వీటిని సాల్వ్ చేసేందుకు వెళ్తుంటాడు. ప్రేక్షకులకు మాత్రం అతని గోల్ వేరు కదా అనిపిస్తుంటుంది.

సినిమా సెకండాఫ్ లో ఛేజింగ్ లా స్క్రీన్ ప్లే ఉంటుంది. సెకండాఫ్ లో మీరు ఫోన్ వైపు చూడరనే నమ్మకం ఉంది. అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది. స్పీడ్ లాంటి టైటిల్ మా మూవీకి పెట్టుకోవచ్చు. అయితే ఇంగ్లీష్ టైటిల్ ఎందుకని భజే వాయు వేగం అని పెట్టాం. మా యూవీ వారికి కూడా బాగా నచ్చింది. వెంటనే రిజిస్టర్ చేయించాం. అఖిల్ తో యూవీలో సినిమా చేయబోతున్న డైరెక్టర్ అనిల్ ఈ సినిమా చూసి టైటిల్ సజెస్ట్ చేశాడు.

ఈ సినిమా బీజీఎం కోసం స్పెషల్ కేర్ తీసుకున్నా. దాదాపు మూడు నెలలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమే టైమ్ కేటాయించా. కపిల్ అని కొత్త అతను బీజీఎం ఇచ్చాడు. రాధన్ సాంగ్ చేశాడు. అతను చెన్నైలో ఉంటే నేను అక్కడికి ఇక్కడికి తిరగడానికి టైమ్ ఉండదని రాధన్ తో బీజీఎం చేయించలేదు. సెకండాఫ్ లో ఒక్క సాంగ్ ఉండదు. స్క్రీన్ ప్లే రేసీగా వెళ్తుంటుంది. కథ స్పీడ్ గా వెళ్తే ఆడియెన్స్ ఎవరూ అక్కడ పాట ఉండాలని కోరుకోరు. పైగా దాన్నో స్పీడ్ బ్రేకర్ లా భావిస్తారు.

ఆడియెన్స్ రీల్స్ చూసే ట్రెండ్ లోకి వచ్చారు. ఒక్క క్షణం బోర్ కొట్టినా రీల్ మార్చేస్తారు. ఇలాంటి టైమ్ లో సినిమా చిన్న గ్యాప్ ఇవ్వకుండా ఆడియెన్ ను ఎంగేజ్ చేయాలనేది నా ఆలోచన. "భజే వాయు వేగం" సినిమాకు అదే ఫాలో అయ్యి రూపొందించాం. మనం అతన్ని హీరో అని పిలుస్తున్నాం కాబట్టి హీరో ఒక పెద్ద లక్ష్యంతో ఉండాలని నేను అనుకుంటా. ప్రేక్షకులకు హీరోకు కనెక్ట్ అవుతారు. వాళ్లకు స్ఫూర్తినిచ్చేలా హీరో క్యారెక్టర్ ఉండాలి.

అసిస్టెంట్ డైరెక్టర్ గా నేర్చుకున్న దానికంటే ఓ సినిమాకు డైరెక్షన్ చేస్తే వెయ్యింతలు పని నేర్చుకోవచ్చు. సినిమాను అనేక దశల్లో బెటర్ మెంట్ చేసుకోవచ్చు. మిగతా ఏ క్రియేటివ్ జాబ్ లోనూ ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు.

ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. భజే వాయు వేగం సినిమా రిలీజ్ అయ్యాక నా కొత్త మూవీ అనౌన్స్ చేస్తా.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement